భారత మహిళలు భారత సైన్యంలో చేరేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలు గత కొన్నేళ్లుగా గణనీయంగా పెరిగాయి. 1992లో మహిళలను అధికారులుగా నియమించడం ప్రారంభించిన తర్వాత, ఇప్పటి వరకు 1,200 మందికి పైగా లేడి ఆఫీసర్లు వివిధ విభాగాల్లో సేవలందిస్తున్నారు. శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, దేశ సేవ భావన ఉన్న మహిళల కోసం భారత ఆర్మీ పలు ప్రవేశ మార్గాలను అందిస్తోంది.
పాఠశాల చదువులు పూర్తిచేసిన యువత నుంచి గ్రాడ్యుయేషన్ చేసిన మహిళల వరకు అందరికీ అనువుగా ప్రవేశ పద్ధతులు ఉన్నాయి. 10+2 పూర్తిచేసిన అమ్మాయిలకు NDA ప్రవేశం పెద్ద అవకాశం. 16.5 నుంచి 19.5 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు UPSC ద్వారా NDAకి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆర్మీ కోసం 12వ తరగతి అర్హత సరిపోతే, ఎయిర్ ఫోర్స్ మరియు నేవీ కోసం తప్పనిసరిగా మ్యాథ్స్, ఫిజిక్స్ ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు కఠినమైన శిక్షణ ఇవ్వబడుతుంది. తరువాత వారు అధికారులుగా నియమితులవుతారు. దేశ రక్షణలో మహిళలు కూడా సమాన బాధ్యతలు నిర్వహించగలరన్న నమ్మకాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన మహిళలు UPSC ద్వారా Short Service Commission (SSC Non-Technical) కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 19 నుంచి 25 ఏళ్ల మధ్య ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చు. SSC ద్వారా నియమితులయ్యే మహిళలకు సైన్యంలో 10 సంవత్సరాల సేవా కాలం ఉంటుంది. అవసరాన్ని బట్టి ఈ కాలాన్ని 14 సంవత్సరాల వరకు పొడిగించే అవకాశం కూడా ఉంటుంది. నాయకత్వ లక్షణాలు, సమస్యల పరిష్కారం, అత్యవసర పరిస్థితుల్లో పని చేసే సామర్థ్యం ఉన్నవారికి ఈ అవకాశం అత్యంత అనుకూలంగా ఉంటుంది.
UPSC రాయకుండా మహిళలు సైన్యంలో చేరే మార్గాలలో SSCW (NCC) ప్రవేశం కూడా ఒకటి. NCC సీనియర్ డివిజన్ ఆర్మీలో కనీసం రెండు లేదా మూడు సంవత్సరాలు సేవ చేసి, ‘C’ సర్టిఫికెట్‌లో ‘B’ గ్రేడ్ పొందిన వారు దరఖాస్తు చేసుకోగలరు. 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఇటువంటి NCC నేపథ్యం ఉన్న అభ్యర్థులు ఇప్పటికే క్రమశిక్షణ, శారీరక దృఢత్వం, నాయకత్వ నైపుణ్యాలు కలిగి ఉండడం వలన ఎంపికలో వారికి ప్రాధాన్యం లభిస్తుంది.
న్యాయ విద్య పూర్తిచేసిన మహిళలకు JAG (Judge Advocate General) బ్రాంచ్‌లో ప్రవేశం ఉంది. 21 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు గల LLB గ్రాడ్యుయేట్లు CLAT PG స్కోర్‌తో పాటు దరఖాస్తు చేసుకోవాలి. ఆర్మీలో న్యాయ సలహాదారులుగా పనిచేసే ఈ అధికారులకు సైన్యానికి సంబంధించిన చట్టపరమైన అంశాల్లో కీలక బాధ్యతలు ఇవ్వబడతాయి.
ఇంజినీరింగ్ చేసిన మహిళలకు కూడా సైన్యంలో అవకాశాలు ఉన్నాయి. SSCW (Technical) ద్వారా 20 నుంచి 27 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఇంజినీరింగ్ డిగ్రీ హోల్డర్లు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ వంటి విభాగాల్లో నైపుణ్యం ఉన్న అభ్యర్థులకు భారత ఆర్మీ పెద్ద ఎత్తున అవకాశాలను అందిస్తుంది. మరింత సమాచారం కోసం ఇండియన్ ఆర్మీ వెబ్సైట్ కి సందర్శించవలెను.
మొత్తం చూస్తే చదువు పూర్తి చేసిన తర్వాత దేశ సేవలో పాల్గొనాలనే సంకల్పం ఉన్న మహిళలకు భారత సైన్యంలో ఎన్నో ద్వారాలు తెరుచుకున్నాయి. NDA నుంచి టెక్నికల్ ప్రవేశాల వరకు పలు విధాలుగా మహిళలు దేశ రక్షణలో భాగస్వాములు కావచ్చు. అవసరమైన అర్హతలు కలిగి, ధైర్యం, క్రమశిక్షణ, పట్టుదల ఉన్న యువత ఈ అవకాశాలను వినియోగించుకుంటే భారత సైన్యంలో మరిన్ని లేడి ఆఫీసర్లు సేవలందించడం ఖాయం.