కెనడాలో చదువు పూర్తిచేసుకున్న తరువాత ఉద్యోగం పొందాలని ఆశించే భారతీయ విద్యార్థులకు వర్క్ పర్మిట్ చాలా కీలకం. అయితే ఇటీవల పీజీ వర్క్ పర్మిట్ (PGWP) అనుమతి రాకపోవడం వల్ల చాలా మంది విద్యార్థులు కష్టాలలో పడుతున్నారు. కెనడాలో సుమారుగా నాలుగు లక్షలకు పైగా భారత విద్యార్థులు చదువుతున్న నేపథ్యంలో ఈ సమస్య పెద్ద చర్చకు కారణమైంది. అయినప్పటికీ, PGWP రాకపోయినా కెనడాలో పని చేసే అవకాశాలు పూర్తిగా మూసుకుపోవని నిపుణులు చెబుతున్నారు.
చదువుతున్న సమయంలోనే కెనడాలో ఎక్కువ మంది విద్యార్థులు పార్ట్ టైమ్ ఉద్యోగాలు చేస్తారు. ఇది వారికి డబ్బు సంపాదించడమే కాకుండా, ఉద్యోగ అనుభవం కూడా ఇస్తుంది. చదువు పూర్తయ్యాక PGWP పొందితే ఉద్యోగం పూర్తి సమయంగా చేయవచ్చు. ఈ పర్మిట్‌ను చదువు ముగిసిన 180 రోజుల్లో తప్పనిసరిగా అప్లై చేయాలి. కోర్సు వ్యవధిపై ఆధారపడి ఈ పర్మిట్ ఎనిమిది నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు వాలిడ్‌గా ఉంటుంది. శాశ్వత నివాసం (PR) దిశగా ప్రయాణించే విద్యార్థులకు ఈ పర్మిట్ చాలా సహాయపడుతుంది.
అయితే PGWP రాకపోతే విద్యార్థులు గందరగోళంలో పడటం సహజం. చాలా మంది ఉద్యోగం దొరకదేమో అనే భయంతో ఆందోళన పడుతుంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో మరో ప్రత్యామ్నాయ మార్గం ‘టెంపరరీ ఫారిన్ వర్కర్ ప్రోగ్రామ్’ (TFWP). ఈ కార్యక్రమం ద్వారా కెనడాలోని కంపెనీలు దేశంలో మనుషులు లేని పోస్టులను భర్తీ చేసేందుకు విదేశీయులను నియమించుకోవచ్చు. అందులో విద్యార్థులు కూడా అర్హులే.
ఈ పద్ధతి ద్వారా ఉద్యోగం పొందాలంటే ముందుగా కెనడాలోని ఒక కంపెనీ మీకు ఉద్యోగ ఆఫర్ ఇవ్వాలి. ఆ కంపెనీ మీ కోసం LMIA అనే సర్టిఫికేట్ తీసుకోవాలి. ఇది ఆ పని చేయడానికి కెనడాలో స్థానికంగా ఎవరూ లేరని నిర్ధారిస్తుంది. LMIA ఆమోదం వచ్చిన తర్వాతే వర్క్ పర్మిట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. పర్మిట్ వచ్చాక కెనడాలో చట్టబద్ధంగా పని చేయడం ప్రారంభించవచ్చు.
కెనడాలో చదువు ఉద్యోగాలపై భారతీయుల ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో ఇటువంటి ప్రత్యామ్నాయాలు విద్యార్థులకు భరోసా ఇస్తున్నాయి. PGWP రాకపోయినా TFWP ద్వారా అవకాశాలు ఉన్నాయి. అందుకే నిపుణులు విద్యార్థులు ముందుగానే పరిశ్రమలో కాంటాక్టులు ఏర్పరచుకోవాలని, తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచిస్తున్నారు. సరైన మార్గం ఎంచుకుంటే కెనడాలో ఉండి ఉద్యోగం పొందే అవకాశం ఇంకా ఉందని వారు చెబుతున్నారు.