ఈరోజు నుంచి హిందూ ధార్మిక పరంగా ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రావణమాసం ప్రారంభమవుతోంది. ఇది లక్ష్మీనారాయణులకు అత్యంత ప్రీతికరమైన మాసంగా పరిగణించబడుతుంది. పండితుల చెబుతున్న వివరాల ప్రకారం, ఈ మాసంలో పూజలు, వ్రతాలు నిష్టతో ఆచరిస్తే అనేక విశేష ఫలితాలు కలుగుతాయి. భక్తి భావంతో ఈ రోజులను గడిపితే కుటుంబానికి శాంతి, సంపద, ఆరోగ్యంతో కూడిన జీవితం ప్రసాదించబడుతుందని విశ్వాసం ఉంది.
ప్రత్యేకంగా శుక్రవారాలలో మహిళలు సూర్యోదయానికి ముందే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రంగా ఉంచి, రంగవల్లులతో అలంకరించాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజించి నైవేద్యం సమర్పిస్తే ఆమె అనుగ్రహం లభిస్తుంది. అలాగే కొత్తగా పెళ్లైన మహిళలు శ్రావణమాసంలోని ప్రతి మంగళవారం మంగళగౌరీ వ్రతాన్ని ఆచరిస్తే భోగభాగ్యాలు, సౌభాగ్యం, సాంతానసౌఖ్యాలను పొందుతారని పండితులు వివరిస్తున్నారు.
ఈ మాసంలో భక్తులు శివపూజ, లక్ష్మీపూజ, సత్యనారాయణ వ్రతాలు, నామస్మరణ వంటి ఆధ్యాత్మిక క్రియాకలాపాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. శ్రద్ధతో పాటుగా నియమంతో శ్రావణ మాసాన్ని గడిపితే దైవానుగ్రహం అధికంగా లభిస్తుందని నమ్మకం.