బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిన నేపథ్యంలో మత్స్యకారులు సముద్రంలో
వేటకు వెళ్లరాదని ఏపీ మంత్రి వంగలపూడి అనిత (Anita Vangalapudi) సూచించారు. రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై విపత్తు నిర్వహణ ఎండీ ప్రఖర్ జైన్, సిబ్బందితో మంత్రి సమీక్ష నిర్వహించారు.
వాయుగుండం రానున్న 24 గంటల్లో ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్ వైపు కదులుతుందన్నారు. ఆదివారం (Sunday) వరకు కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు.. రాయలసీమ ప్రాంతంలో పలుచోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే వీలుందని చెప్పారు.
తీరం వెంబడి గంటకు 40-60 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముందన్నారు. శ్రీకాకుళం (Srikakulam), విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని తీర ప్రాంతాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే వీలుందని మంత్రి చెప్పారు.
అత్యవసర సహాయక చర్యలకు కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నంబర్లు 112, 1070, 18004250101ను సంప్రదించాలని సూచించారు. వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద హాట్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్శాఖలతో సమన్వయం చేసుకుని గండ్లు గుర్తించి చర్యలు తీసుకోవాలని మంత్రి అనిత ఆదేశించారు.