ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాస తెలుగులు (Non-Resident Telugus - NRTs) తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆసక్తిగా ఎదురుచూసే వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానమ్ (TTD) పెంచింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు, టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రవాస తెలుగుల సంక్షేమం మరియు వారికి సేవలు అందించడంలో భాగంగా ఈ కోటాను పెంచారు.
2014 లో అధికారంలోకి వచ్చిన అప్పటి టీడీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్-రెసిడెంట్ తెలుగు (APNRT) సొసైటీని ఏర్పాటు చేసింది. NRTలకు దేవాలయ సేవలతో సహా అనేక రకాల సేవలను అందించడమే దీని లక్ష్యం. అప్పుడు టీడీపీ ప్రభుత్వం టీటీడీని ఆదేశించి, NRIల కోసం రోజుకు 50 వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను ప్రత్యేకంగా కేటాయించింది. ఈ సేవ 2019 వరకు కొనసాగింది.
2019 లో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఈ కోటాను రోజుకు 10 వీఐపీ టికెట్లకు తగ్గించింది. విమర్శలు వచ్చినప్పటికీ గత ఐదేళ్లలో కోటా పెంచలేదు.
2024లో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చాక, ముఖ్యమంత్రి చంద్రబాబు NRIల పాత్రను గుర్తించి, వారికి సేవలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో NRIలు పోషించే పాత్రను పలు వేదికలపై సీఎం చంద్రబాబు నొక్కి చెప్పారు.
ఈ మేరకు సీఎం చంద్రబాబు, ఎన్ఆర్ఐ సాధికారత మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు డాక్టర్ రవికుమార్ వేమూరు వంటి ప్రముఖులతో వరుస సమావేశాలు నిర్వహించి, NRI సేవలను పునరుద్ధరించడంపై చర్చించారు.
సీఎం చంద్రబాబు సూచనల మేరకు, టీటీడీ పాత కోటాను పునరుద్ధరిస్తూ, వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ల కోటాను 10 రెట్లు పెంచుతూ (రోజుకు 100 మందికి దర్శనాలు) ఉత్తర్వులు జారీ చేసింది. టీటీడీ నిర్ణయంపై ప్రవాస తెలుగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమల దర్శనం ప్రతి భక్తుడి యాత్రా ప్రణాళికలో తప్పనిసరి అయినప్పటికీ, గతంలో NRIలు వీఐపీ దర్శనం కోసం రాజకీయ నాయకుల చుట్టూ లాబీయింగ్ చేయాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
NRIల కోసం వీఐపీ టికెట్ల కోటాను 10 రెట్లు పెంచినందుకు సీఎం చంద్రబాబు కు మరియు టీటీడీకి కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ పెంపు NRTలకు శ్రీవారి దర్శనాన్ని మరింత సులభతరం చేస్తుంది. కానీ GO అయితే విడుదల అయ్యింది కానీ 100 దర్శనాలు ఇవ్వడం మాత్రం ప్రారంభం కాలేదు. ఇప్పటివరకు 25 మందికి మాత్రమే ఏపీఎన్నార్టీ తరపున దర్శనాలు ఇవ్వడం జరుగుతుంది.
మంత్రి లోకేష్ అమెరికా పర్యటన లో భాగంగా ఎన్నారైలకు ఈ శుభవార్త అందింది. ఈ సందర్భంగా ఎన్నారైలు అందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ నెలలో ఎన్నారైలు అధిక సంఖ్యలో భారత్ కు వస్తారు. అది గమనించి దర్శనం కోటా ను పెంచినందుకు టీటీడీ కి కూడా పలు సామాజిక మధ్యమాలలో కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు.