ప్రపంచ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మళ్లీ వేగంగా పెరుగుతున్నాయి. శనివారం రోజున స్పాట్ గోల్డ్ ధర మూడు శాతం కంటే ఎక్కువగా ఎగబాకి, రెండు వారాల గరిష్ట స్థాయిని చేరుకుంది. ఫెడరల్ రిజర్వ్ వచ్చే నెలలో వడ్డీ రేట్లను తగ్గించవచ్చనే అంచనాలు ఈ పెరుగుదలకు ముఖ్య కారణంగా భావిస్తున్నారు.
పెట్టుబడిదారులు బంగారాన్ని 'సేఫ్ హేవెన్'గా భావిస్తూ, వడ్డీ రేట్లు తగ్గుతున్న సమయంలో బంగారం విలువ మరింత పెరుగుతుందని నమ్ముతున్నారు. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగి చరిత్రాత్మక గరిష్టాలను సాధించాయి. ఈ వారం మొత్తం పసిడి సుమారు 3.4 శాతం లాభపడనుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
ఈ నెలలో బంగారం ఇప్పటికే 5 శాతం వరకూ పెరిగి, వరుసగా నాల్గో నెల కూడా లాభాల దిశగా కొనసాగుతోంది. వెండి కూడా ఔన్సుకు 56.41 డాలర్లకు చేరి, ఒక్క సెషన్‌లోనే 5.3 శాతం, మొత్తం నెలలో 15 శాతం కంటే ఎక్కువ పెరిగి రికార్డు సృష్టించింది. US Gold Futures కూడా 1 శాతం పెరిగి ఫిబ్రవరి డెలివరీకి 4,245.70 డాలర్ల వద్ద చేరుకుంది.
TD సెక్యూరిటీస్ కమోడిటీ స్ట్రాటజీ గ్లోబల్ హెడ్ బార్ట్ మెలెక్ ప్రకారం, అమెరికా ఆర్థిక వ్యవస్థ 2026 వరకు మందగమనాన్ని ఎదుర్కొనవచ్చని, ఇలాంటి పరిస్థితుల్లో ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. తక్కువ వడ్డీ రేట్లు బంగారం మార్కెట్‌కు అత్యంత అనుకూలంగా పనిచేస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా ఫెడ్ గవర్నర్ క్రిస్టోఫర్ వాలర్, న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు జాన్ విలియమ్స్ చేసిన సాఫ్ట్ వ్యాఖ్యలు, అలాగే ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా బలహీన ఆర్థిక సూచీలు అన్నీ కలిసి వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలను మరింత బలపరిచాయి. దీంతో డిసెంబర్‌లో రేటు తగ్గింపు అవకాశం 87 శాతానికి పెరిగింది, ఇది గత వారం 50 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.