కేంద్ర ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించిన కనెక్టివిటీని గణనీయంగా పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రం నుంచే కాకుండా పక్క రాష్ట్రాల నుంచి కూడా ప్రయాణికులు సులభంగా, తక్కువ సమయంలో భోగాపురం చేరుకునేలా కొత్త రవాణా మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు మరో కొత్త రహదారి నిర్మాణానికి కేంద్రం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధికారికంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ ఉత్తరాంధ్ర అభివృద్ధికి గేమ్‌చేంజర్‌గా మారనుందని ఆయన పేర్కొన్నారు.
శనివారం శ్రీకాకుళంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ, భువనేశ్వర్ నుంచి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నూతన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. ఈ రహదారి అమలులోకి వస్తే ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని స్పష్టం చేశారు. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయాణ సౌకర్యం మాత్రమే కాకుండా, పారిశ్రామిక అభివృద్ధి, వాణిజ్య విస్తరణకు కూడా బలమైన బాట పడుతుందని వివరించారు. ముఖ్యంగా ఎయిర్‌పోర్ట్ ఆధారిత ఆర్థిక కార్యకలాపాలు విస్తరించనున్నాయని చెప్పారు.
అదేవిధంగా, విశాఖపట్నాన్ని కేంద్రంగా అభివృద్ధి చెందుతున్న పారిశ్రామిక క్లస్టర్ ప్రభావం శ్రీకాకుళం జిల్లాపై కూడా స్పష్టంగా కనిపించనుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. రానున్న సంవత్సరాల్లో శ్రీకాకుళం జిల్లా మౌలిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు, పెట్టుబడుల పరంగా గణనీయమైన మార్పులను చూడబోతోందన్నారు. పలు ముఖ్యమైన జాతీయ, రాష్ట్రస్థాయి ప్రాజెక్టులు జిల్లాలో ఆర్థిక వృద్ధికి, యువతకు ఉద్యోగ కల్పనకు తోడ్పడతాయని తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి పటంలో మరింత బలంగా నిలుస్తుందని పేర్కొన్నారు.
భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయం పనులను ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే ఏడాదిలోనే ఈ విమానాశ్రయాన్ని ప్రారంభించాలనే లక్ష్యంతో పనులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం 2,708.26 ఎకరాల భూమిని కేటాయించగా, భారీ నిధులు మంజూరు చేశారు. విశాఖపట్నం బీచ్ రోడ్ నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు ఆరు వరుసల రహదారిని అభివృద్ధి చేస్తున్నారు. అదేవిధంగా బీచ్ కారిడార్, మెట్రో కనెక్టివిటీకి సంబంధించిన ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. భోగాపురం విమానాశ్రయం విశాఖపట్నానికి 55 కిలోమీటర్లు, విజయనగరానికి 25 కి.మీ., శ్రీకాకుళానికి 65 కి.మీ. దూరంలో ఉంది. ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టిన విషయం తెలిసిందే.