SIR: ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత.. ఎస్‌ఐఆర్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపు!
SIR: ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు.
ఖచ్చితమైన ఓటర్ల జాబితాతోనే బలమైన ప్రజాస్వామ్యం: మంత్రి సుభాష్..
18 ఏళ్లు నిండిన ప్రతి యువకుడు ఓటరుగా నమోదు కావాలి..
ప్రజాస్వామ్య వ్యవస్థకు ఓటు హక్కు పునాది అని, అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు.
కాజులూరు మండలం గొల్లపాలెంలో మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో మంత్రి సుభాష్ మాట్లాడారు. రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పించిన అమూల్యమైన హక్కు ఓటు హక్కు అని ఆయన అన్నారు. ఎన్నికలు పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరగాలంటే ఖచ్చితమైన ఓటర్ల జాబితా అవసరమని పేర్కొన్నారు.
ఎస్ఐఆర్ కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరి పేర్లను ఓటర్ల జాబితాలో చేర్చడం, మరణించిన వారి పేర్లను తొలగించడం, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు మారిన వారి వివరాలను సరిచేయడం, ఓటర్ల సమాచారం నవీకరించడం జరుగుతుందని మంత్రి వివరించారు. ఈ ప్రక్రియతో ఓటర్ల జాబితా మరింత పారదర్శకంగా, విశ్వసనీయంగా మారుతుందని తెలిపారు.
18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రతి యువకుడు, యువతి తప్పనిసరిగా ఓటరుగా నమోదు కావాలని మంత్రి సూచించారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే శక్తి యువత చేతుల్లో ఉందని, యువ ఓటర్ల భాగస్వామ్యం ప్రజాస్వామ్య బలోపేతానికి ఎంతో ముఖ్యమని అన్నారు.
బూత్ స్థాయి కార్యకర్తలు, పార్టీ నాయకులు, గ్రామ కమిటీ సభ్యులు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల వివరాలను పరిశీలించాలని, ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి కోరారు. ఈ కార్యక్రమం ఎలాంటి రాజకీయ పక్షపాతం లేకుండా నిర్వహించాల్సిన అవసరం ఉందని, ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా చూడాలని సూచించారు.
ప్రజలు కూడా ఎస్ఐఆర్ కార్యక్రమానికి సహకరించాలని, అవసరమైన పత్రాలను అందించాలని, ఓటర్ల జాబితాలో తప్పులు ఉంటే వెంటనే సరిచేయించుకోవాలని మంత్రి తెలిపారు. ఖచ్చితమైన ఓటర్ల జాబితా ఎన్నికల విశ్వసనీయతను పెంచడమే కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
గత రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ నియోజకవర్గాన్ని సుమారు రూ.250 కోట్లతో అభివృద్ధి చేశామని మంత్రి సుభాష్ తెలిపారు. కాజులూరు మండల అభివృద్ధికి దాదాపు రూ.60 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.
రాబోయే గోదావరి పుష్కరాల కోసం మరో రూ.150 కోట్లు మంజూరు కానున్నాయని వెల్లడించారు. అదనంగా సీఎస్ఆర్ నిధులతో ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మూడు మండలాల్లో కంటైనర్ ఆసుపత్రులు, సంచార వైద్యశాలలు, ఎలక్ట్రిక్ ఆటోలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందని వైద్య సేవలను కంటైనర్ ఆసుపత్రుల ద్వారా అందించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తున్నామని, గుండెపోటు మరణాలను తగ్గించేందుకు ఆధునిక స్టెతస్కోప్ల ద్వారా ముందస్తుగా గుండె సంబంధిత సమస్యలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోందని వివరించారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ అక్కల రిశ్వంత్ రాయ్, మండల టీడీపీ అధ్యక్షులు చవ్వాకుల నారాయణమూర్తి, వనుం వీరబ్రహ్మం, కోట తాతబ్బాయి, చుండ్రు వీర్రాజు చౌదరి, బొమ్మిడి సోమాలమ్మ, పలివెల రాజు, ఆకుల సతీష్, క్లస్టర్, కో-క్లస్టర్, బూత్ ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు.
Tags
Be the first to react