ప్రియమైన ఆంధ్రప్రవాసి పాఠక భక్తులారా,
సాక్షాత్తు వ్యాస భగవానుని కృపా ప్రసాదంతో, గీతామాత ఆరాధనకు మనకు లభించిన ఈ పవిత్ర అవకాశాన్ని మీతో పంచుకోవడం ఆనందకరమైన కర్తవ్యంగా భావిస్తున్నాం..
సాక్షాత్తు భగవంతుని వ్యక్తస్వరూపము, మూర్తి స్వరూపమైన శ్రీమద్భగవద్గీత మానవాళికి అందిన రోజు గీతా జయంతి రోజు. డిసెంబర్ ఒకటవ తేదీకి గీతా జయంతి వస్తుంది. ఈ గీతా జయంతి సందర్భంగా, పూజ్య శ్రీ గురుదేవుల ఆశీస్సులతో శ్రీమద్భగవద్గీత అష్టోత్తర శతనామావళిలోని ఈరోజు 51వ రోజు నామాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము.
ప్రతి నామం వెనుక ఉన్న అర్థం, ఆధ్యాత్మికత, భక్తి సారాన్ని తెలుసుకొని మనం గీతామాతను మరింతగా ఆరాధించుకుందాం. ఈ పవిత్ర ప్రయత్నంలో భాగంగా, ఆంధ్రప్రవాసి Devotional విభాగంలో ప్రతి రోజు ఒక నామాన్ని మీకు అందజేస్తూ, మన గీతామాత కరుణకు అంజలి ఘటిస్తున్నాము.
ఓం వ్యాసదేవాయ నమః
పూజ్యశ్రీ భవఘ్నీ గురుదేవుల వారి అనుగ్రహం తో
శ్రీమద్భగవద్గీత అష్టోత్తరశత నామావళి
51. ఓం యోగక్షేమ ప్రదాయై నమః
అనన్యాశ్చింతయంతో మాం
యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్ ॥ 9.22
అర్థం: ఎవరు ఇతర భావాలు లేకుండా నన్ను గూర్చి చింతిస్తూ, ధ్యానిస్తున్నారో, ఎల్లప్పుడు నాయందే నిష్ఠ గలిగి ఉన్నారో అట్టి వారి యోగక్షేమాలను నేను వహిస్తున్నాను.
అన్యము లేనిది అనన్యము. అనగా భగవంతునియందు తప్ప అనవసర విషయాల వైపు మనస్సు పోనీయకుండా ఉండటం. నిరంతర దైవధ్యాన తత్పరత ఉండాలి. అప్పుడు నా మంచి చెడుల గూర్చి ఆలోచించనక్కర లేదు. అది భగవంతుడే చూసుకుంటారు. నా యోగ క్షేమాలు ఆయనవే. ఎప్పుడెప్పుడు ఏది నాకు క్షేమకరమో అప్పుడప్పుడు దానిని ఆ పరమాత్మే తప్పక ప్రసాదిస్తారు.
శ్రీమహాభాగవతం సప్తమ స్కంధంలో ప్రహ్లాదుడి కథ వస్తుంది. రాక్షసరాజైన హిరణ్య కశిపుని కుమారుడు ప్రహ్లాదుడు. పూర్వజన్మ సంస్కారం వలన అతనికి చిన్నతనం నుంచే హరిభక్తి అలవడిరది. అది నిశ్చలభక్తి. అనన్యభక్తి. తింటూ, త్రాగుతూ, తిరుగుతూ, చూస్తూ, నవ్వుతూ, మాట్లాడుతూ - ఏ పని చేస్తున్నా భగవత్ ధ్యానంలోనే ఉండేవాడు. అది తెలిసిన తండ్రి అతనిని చండామర్కులు అనే గురువులకు అప్పగించి, కొడుకు భక్తి మాన్పించమని కోరాడు. అది సాధ్యం కాలేదు. హిరణ్యకశిపుడు అనేక విధాల కొడుకును శిక్షించాడు. అయినా అతని దేహం, మనసు చెక్కు చెదరలేదు. చివరికి ‘ఎందున్నాడు నీ దేవుడు’ అని తండ్రి అడిగితే ప్రహ్లాదుడు ఇలా చెప్పాడు :
ఇందు గలడందు లేడని
సందేహము వలదు, చక్రి సర్వోపగతుం
డెందెందు వెదకి చూచిన
నందందే కలడు దానవాగ్రణి వింటే
పరమాత్మ సర్వవ్యాపకుడు, ఇక్కడ ఉన్నాడు, అక్కడ లేడు అనేది లేదు. ఎక్కడెక్కడ వెదికితే అక్కడక్కడే ఉన్నాడు.
‘అయితే ఈ స్తంభంలో ఉన్నాడా?’ అని హిరణ్యకశిపుడు దానిని ఒక్క వ్రేటు వేయగా, దానినుండి నరసింహ రూపంలో భగవంతుడు ప్రత్యక్షమై, రాక్షసరాజును వధించి, ప్రహ్లాదుడిని కాపాడాడు. ఆ విధంగా అనన్యభక్తి కలిగిన ప్రహ్లాదుడి యొక్క యోగక్షేమాలను భగవానుడే వహించాడు.
అట్టి భగవత్ స్వరూపమై, నాకేది అవసరమో దానిని చక్కగా ప్రసాదిస్తూ, నా యోగక్షేమాలను వహిస్తున్న గీతామాతకు కృతజ్ఞతతో కైమోడ్పు చేస్తున్నాను.
ఈక్రింది telegram channel లింకు ద్వారా మనం పూజ్య శ్రీ భవఘ్ని గురుదేవుల వారి సత్సంగాలు శ్రవణం చేయవచ్చు
లింకు లో జాయిన్ అవండి
ఇంతటి మహత్తరమైన అవకాశాన్ని మనకందించిన గురుదేవుల వారికి అమ్మకు కృతజ్ఞతలు తెలియజేస్తూ
జై గురుదేవ్
నామం 44: Bhagavad Gita: హితకరమైన కోరికలతో జీవిస్తే ఫలితం తప్పదు.. గీతా సందేశం.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -44!
నామం 41 : Bhagavad Gita: జననం మరణం అనివార్యం.. ఇది తెలిసినవాడు శోకించడు... కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -41!
నామం 40 : Bhagavad Gita: అహం బ్రహ్మాస్మి.. మనిషి నుంచి పరమాత్మ వైపు ఆత్మయాత్ర.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా - 40!
నామం 36 : Bhagavad Gita :సుఖం ఉన్నంత మాత్రాన శాంతి ఉండదు.. కర్మ, భక్తి, జ్ఞాన యోగాల మార్గదర్శిని గీతా -36!