రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ గుజరాత్ రాష్ట్రంపై మరోసారి భారీ విశ్వాసాన్ని ప్రకటించారు. రాబోయే ఐదు సంవత్సరాల్లో గుజరాత్‌లో రూ.7 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. రాజ్‌కోట్‌లో నిర్వహించిన వైబ్రంట్ గుజరాత్ ప్రాంతీయ సదస్సులో మాట్లాడిన అంబానీ, గుజరాత్ రిలయన్స్‌కు కేవలం ఒక రాష్ట్రం మాత్రమే కాదని, తమ సంస్థకు అది గుర్తింపు, ఆత్మ, పునాది అని పేర్కొన్నారు. గత ఐదు సంవత్సరాల్లోనే గుజరాత్‌లో రిలయన్స్ రూ.3.5 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టిందని, రాష్ట్రంలో అతిపెద్ద పెట్టుబడిదారుగా రిలయన్స్ నిలిచిందని ఆయన తెలిపారు.
రాబోయే ఐదు సంవత్సరాల్లో పెట్టుబడులను రెట్టింపు చేసి రూ.7 లక్షల కోట్లకు తీసుకెళ్లేందుకు రిలయన్స్ పూర్తిగా కట్టుబడి ఉందని ముఖేష్ అంబానీ స్పష్టం చేశారు. ఈ భారీ పెట్టుబడులు ఉపాధి అవకాశాలు, జీవనోపాధి, ఆర్థిక శ్రేయస్సు పెంచేలా ఉంటాయని, వాటి ఫలితాలు ప్రతి గుజరాతీతో పాటు ప్రతి భారతీయుడికి చేరుతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా గుజరాత్ అభివృద్ధి కోసం రిలయన్స్ చేపట్టనున్న ఐదు ప్రధాన నిబద్ధతలను అంబానీ ప్రకటించారు. ముఖ్యంగా గుజరాత్‌ను భవిష్యత్తు సాంకేతికతలు, పరిశ్రమల కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తమ ప్రణాళికలు ఉంటాయని వివరించారు.
క్లీన్ ఎనర్జీ, గ్రీన్ మెటీరియల్స్ రంగాల్లో ప్రపంచ నాయకత్వం సాధించడమే రిలయన్స్ ప్రధాన లక్ష్యమని ముఖేష్ అంబానీ వెల్లడించారు. జామ్‌నగర్‌లో ప్రపంచంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ఎకోసిస్టమ్ను రిలయన్స్ అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఇందులో సౌరశక్తి, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ ఎరువులు, స్థిరమైన విమాన ఇంధనం, సముద్ర ఇంధనం, అధునాతన పదార్థాల తయారీ వంటి విభాగాలు ఉన్నాయి. ఒకప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద హైడ్రోకార్బన్ ఇంధన ఎగుమతి కేంద్రంగా ఉన్న జామ్‌నగర్, రాబోయే కాలంలో భారతదేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ మెటీరియల్స్ ఎగుమతి కేంద్రంగా మారనుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
అదేవిధంగా గుజరాత్‌ను భారతదేశ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని కూడా ముఖేష్ అంబానీ ప్రకటించారు. ప్రతి భారతీయుడికి AI సాంకేతికతను సరసమైనదిగా, అందుబాటులో ఉండేలా చేయడమే రిలయన్స్ లక్ష్యమని తెలిపారు. ఈ దిశగా జామ్‌నగర్‌లో భారతదేశంలోనే అతిపెద్ద AI-రెడీ డేటా సెంటర్‌ను జియో నిర్మిస్తోందని వెల్లడించారు. ప్రపంచంలోనే అతిపెద్ద వాటిలో ఒకటైన మల్టీ-గిగావాట్ యుటిలిటీ-స్కేల్ సోలార్ ప్రాజెక్ట్ ద్వారా 24 గంటల క్లీన్ ఎనర్జీ సరఫరా సాధ్యమవుతుందని, ఇది భారత ఆర్థిక అభివృద్ధికి కొత్త ఉత్సాహాన్ని అందిస్తుందని అంబానీ పేర్కొన్నారు.