గతేడాది డిసెంబర్‌లో విమాన సర్వీసుల రద్దు, జాప్యాలతో ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన (IndiGo) ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై పౌర విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) డీజీసీఏ కఠిన చర్యలు తీసుకుంది. ఈ వ్యవహారంలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు గుర్తించిన డీజీసీఏ, ఇండిగోపై రూ. 22.20 కోట్ల భారీ జరిమానా విధించింది. అంతేకాదు, సంస్థ సీనియర్ మేనేజ్‌మెంట్ బాధ్యతను కూడా ప్రశ్నిస్తూ చర్యలు చేపట్టినట్లు వెల్లడించింది.
ఈ ఘటన 2025 డిసెంబర్ 3 నుంచి 5వ తేదీ మధ్య చోటుచేసుకుంది. ఈ మూడు రోజుల వ్యవధిలో ఇండిగో విమాన సేవలు పూర్తిగా అస్తవ్యస్తమయ్యాయి. మొత్తం 2,507 విమానాలు రద్దుకాగా, మరో 1,852 విమానాలు గంటల తరబడి ఆలస్యంగా నడిచాయి. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా వివిధ విమానాశ్రయాల్లో సుమారు మూడు లక్షల మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
ఈ వ్యవహారంపై కేంద్ర పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు డీజీసీఏ నాలుగు సభ్యులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టింది. విచారణలో ఇండిగో సంస్థ నిర్వహణలో పలు వైఫల్యాలు ఉన్నట్లు తేలింది. సామర్థ్యాన్ని మించి విమాన సర్వీసులను ప్లాన్ చేయడం వల్ల వ్యవస్థ పూర్తిగా ఒత్తిడికి లోనైందని కమిటీ గుర్తించింది.
అలాగే విమానయానానికి సంబంధించిన సాఫ్ట్‌వేర్ వ్యవస్థలు బలహీనంగా ఉండటం, ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, అత్యవసర పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు మేనేజ్‌మెంట్ సిద్ధంగా లేకపోవడం వంటి అంశాలు బయటపడ్డాయి. ముఖ్యంగా రెగ్యులేటరీ నిబంధనలను పాటించడంలో తీవ్ర నిర్లక్ష్యం కనిపించిందని విచారణ నివేదిక స్పష్టం చేసింది.
ఈ కారణాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ, ఇండిగోపై భారీ జరిమానా విధిస్తూ హెచ్చరిక జారీ చేసింది. ఇకపై ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఆపరేషన్ విధానాల్లో మార్పులు చేయాలని ఆదేశించింది. ప్రయాణికుల భద్రత, సౌకర్యాలు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని స్పష్టం చేసింది.