Iran Israel War Updates: పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరిపోసే హార్మూజ్ జలసంధిపై ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. గత కొద్ది రోజులుగా ఈ కీలక జలమార్గాన్ని ఇరాన్ మూసివేస్తుందనే వార్తలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగించాయి. అయితే, తాము ఈ మార్గాన్ని అందరికీ మూసివేయలేదని, కేవలం తమ శత్రువులైన అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు చెందిన నౌకలను మాత్రమే అడ్డుకుంటామని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పష్టం చేశారు. మిగిలిన దేశాలన్నీ ఎప్పటిలాగే తమ వ్యాపారాలను కొనసాగించుకోవచ్చని ఆయన భరోసా ఇచ్చారు.
ప్రపంచవ్యాప్తంగా సరఫరా అయ్యే చమురులో దాదాపు 20 శాతం ఈ హార్మూజ్ జలసంధి గుండానే వెళ్తుంది. అందుకే ఈ మార్గంలో చిన్న ఆటంకం కలిగినా ప్రపంచ మార్కెట్లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ నేపథ్యంలో అరాగ్చీ మాట్లాడుతూ.. "చైనా, జపాన్, ఫ్రాన్స్ వంటి దేశాల నౌకలు స్వేచ్ఛగా ప్రయాణించవచ్చు. ఇప్పటికే అనేక చమురు ట్యాంకర్లు ఈ మార్గంలో వెళ్తున్నాయి. ఒకవేళ భద్రతా కారణాల దృష్ట్యా కొన్ని కంపెనీలు భయపడి ముందుకు రాకపోతే దానికి ఇరాన్ బాధ్యత వహించదు" అని తేల్చి చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ తన యుద్ధనౌకలను పంపిస్తామన్న వ్యాఖ్యల తర్వాతే ఇరాన్ ఈ క్లారిటీ ఇవ్వడం గమనార్హం.
మరోవైపు ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై వస్తున్న వార్తలను కూడా అరాగ్చీ కొట్టిపారేశారు. ఇజ్రాయెల్ దాడుల్లో ఆయన గాయపడ్డారని అమెరికా చేస్తున్న ప్రచారం కేవలం మైండ్ గేమ్ మాత్రమేనని ఆయన మండిపడ్డారు. మొజ్తాబా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, రాజ్యాంగబద్ధంగా తన విధులను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. ఇరాన్ వ్యవస్థ ఏదో ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదని, ఏవైనా అనుకోని సంఘటనలు జరిగినా తట్టుకునే శక్తి తమ నాయకత్వానికి ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
అలాగే, అణుబాంబుల విషయంలో జరుగుతున్న చర్చలపై కూడా ఇరాన్ విదేశాంగ మంత్రి స్పందించారు. 11 అణుబాంబులకు సరిపడా యురేనియం తమ వద్ద ఉందని తాము ఎవరినీ బెదిరించలేదని ఆయన స్పష్టం చేశారు. జెనీవా చర్చల సమయంలో అమెరికా ప్రతినిధులు తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని, త్వరలోనే ఆ చర్చల్లో అసలు ఏం జరిగిందనే వాస్తవాలు ప్రపంచానికి తెలుస్తాయని చెప్పారు.
అమెరికా ఒత్తిళ్లకు తాము లొంగిపోయే ప్రసక్తే లేదని ఆయన ఈ సందర్భంగా పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.ఇరాన్ చేసిన ఈ ప్రకటనతో ప్రపంచ దేశాలకు కొంత ఉపశమనం లభించినట్లయింది. ముఖ్యంగా ఆసియా దేశాలకు చమురు సరఫరాలో ఆటంకాలు ఉండవని తేలిపోయింది. అయితే అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై ఆంక్షలు విధించడం వల్ల రానున్న రోజుల్లో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ట్రంప్ ప్రభుత్వం ఈ ఆంక్షలపై ఎలా స్పందిస్తుందో, యుద్ధ నౌకలను రంగంలోకి దించుతుందో లేదో వేచి చూడాలి.