సాంకేతిక రంగం వేగంగా ముందుకు సాగుతున్న ఈ రోజుల్లో కృత్రిమ మేధస్సు ప్రపంచాన్ని కొత్త దిశగా నడిపిస్తుంది. అయితే టెక్నాలజీ ఎంతగా ఉపయోగపడుతోందో, అదే స్థాయిలో దుర్వినియోగానికి కూడా అవకాశం కల్పిస్తోంది. ఇటీవల అంతర్జాతీయంగా తీవ్ర చర్చకు దారితీసిన అంశం ఇదే. ముఖ్యంగా సోషల్ మీడియా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయికతో పుట్టుకొచ్చిన కొత్త టూల్స్ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
ప్రపంచంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మాస్క్ (Elon Musk) ఆధ్వర్యంలో నడిచే X ప్లాట్‌ఫామ్‌కు చెందిన ఏఐ చాట్‌బాట్ గ్రోక్ (Grok) ఇటీవలి కాలంలో వివాదాస్పదంగా మారింది. మొదట్లో వినియోగదారులకు సమాచారం అందించే ఆధునిక చాట్‌బాట్‌గా పేరు తెచ్చుకున్న గ్రోక్, క్రమంగా ఇమేజ్ జనరేషన్, ఫోటో ఎడిటింగ్ వంటి ఫీచర్లతో మరింత ప్రాచుర్యం పొందింది. కానీ ఇదే టెక్నాలజీ కొందరి చేతుల్లోకి వెళ్లడంతో అసభ్యకరమైన కంటెంట్, డీప్‌ఫేక్ చిత్రాలు, అనుమతి లేకుండా వ్యక్తుల ఫోటోల మార్పులు వంటి సమస్యలు బయటపడ్డాయి.
ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మహిళలు, పిల్లలను లక్ష్యంగా చేసుకుని సృష్టిస్తున్న కంటెంట్ సమాజానికి ప్రమాదకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్న తొలి దేశంగా ఇండోనేసియా (Indonesia) నిలిచింది. గ్రోక్ చాట్‌బాట్ వినియోగంపై ఇండోనేసియా ప్రభుత్వం (Indonesia AI Ban) తాత్కాలిక నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇది అంతర్జాతీయ టెక్ రంగంలో పెద్ద చర్చకు కారణమైంది.
ఇండోనేసియా ప్రభుత్వ వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, ఆన్‌లైన్‌లో అసభ్యకర కంటెంట్‌ను (AI Deepfake Issue) మానవ హక్కులకు, వ్యక్తిగత గౌరవానికి భంగం కలిగించే అంశంగా భావిస్తున్నట్లు స్పష్టం చేశాయి. ముఖ్యంగా మహిళలు, చిన్నారుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని సంబంధిత మంత్రి వెల్లడించారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఇండోనేసియాలో ఇప్పటికే ఆన్‌లైన్ అశ్లీలతపై కఠిన నియమాలు అమలులో ఉండగా, ఏఐ టూల్స్ ద్వారా ఈ సమస్య మరింత పెరుగుతుండటంతో ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.
ఇక భారత్‌లో కూడా ఈ అంశంపై ఇప్పటికే స్పందన వచ్చింది. గ్రోక్ చాట్‌బాట్ ద్వారా రూపొందుతున్న అనుచిత కంటెంట్‌పై కేంద్ర ప్రభుత్వం ఎక్స్ సంస్థను వివరణ కోరింది. అభ్యంతరకరమైన కంటెంట్‌ను వెంటనే తొలగించాలని, అలాగే తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై ఎక్స్ సంస్థ స్పందించినప్పటికీ, ప్రభుత్వం మరింత స్పష్టత కోరినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఎక్స్ సంస్థ గ్రోక్‌లో కొన్ని మార్పులు చేసింది. ముఖ్యంగా ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌పై పరిమితులు విధించింది. ఇకపై ఈ సదుపాయం కేవలం ప్రీమియమ్ సబ్‌స్క్రైబర్లకే అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. టెక్నాలజీని బాధ్యతాయుతంగా వినియోగించాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని ఈ వివాదం మరోసారి గుర్తు చేస్తుంది.ఏఐ (Artificial Intelligence News) అభివృద్ధి అనివార్యమైనప్పటికీ దాని వినియోగంపై స్పష్టమైన నియంత్రణలు అవసరమని ఈ ఘటనలు చెబుతున్నాయి. లేకపోతే సాంకేతిక పురోగతి సమాజానికి ముప్పుగా మారే అవకాశం ఉందన్న అభిప్రాయం బలపడుతోంది.