డంపింగ్ యార్డ్‌లకు చెక్.. చెత్త నిర్వహణలో కొత్త మార్గం : మంత్రి నారాయణ..
రాష్ట్రవ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు..
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీలో నిర్మాణంలో ఉన్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్‌ను రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనుల పురోగతిని అధికారులు మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలోని మున్సిపాలిటీలను డంపింగ్ యార్డ్ల రహితంగా మార్చేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందన్నారు.
ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరులో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లు పనిచేస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా మరో ఆరు కొత్త ప్లాంట్లను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు మున్సిపాలిటీల్లో ప్రతిరోజూ ఉత్పత్తి అవుతున్న చెత్తను సమర్థంగా నిర్వహించేందుకు రాష్ట్రవ్యాప్తంగా 107 మున్సిపాలిటీల్లో ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.
ఈ ప్లాంట్ల ద్వారా ప్రతి రోజు సుమారు 5,385 టన్నుల చెత్తను కంపోస్ట్, బయోగ్యాస్‌గా మారుస్తామని మంత్రి వివరించారు. పర్యావరణ పరిరక్షణతో పాటు చెత్తను ఉపయోగకరమైన వనరుగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. నగరాలు, పట్టణాలు పరిశుభ్రంగా ఉండేలా ఆధునిక సాంకేతికతతో చెత్త నిర్వహణ చేపడుతున్నామని చెప్పారు.
గత ప్రభుత్వం చెత్త పన్ను విధించినప్పటికీ సుమారు 150 లక్షల టన్నుల చెత్తను పేరుకుపోయేలా వదిలి వెళ్లిందని మంత్రి నారాయణ విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ చెత్తను తొలగించే పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణం కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.
నిర్మాణంలో ఉన్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్లన్నింటినీ వచ్చే నెలాఖరునాటికి పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తామని మంత్రి స్పష్టం చేశారు. ప్రజలు కూడా చెత్త నిర్వహణలో భాగస్వాములు కావాలని, పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని మంత్రి నారాయణ పిలుపునిచ్చారు.