ప్రజల వినతులు స్వయంగా విన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి..
తాగునీరు, రోడ్లు, పెన్షన్ సమస్యలపై ప్రజల వినతులు..
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారానికి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. చిన్నమండెం మండలం పడమటి కోన గ్రామంలోని బో రెడ్డి గారి పల్లిలో ఉన్న తన సొంత నివాసంలో శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై తమ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ప్రజలు తాగునీటి సమస్యలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పెన్షన్లు, రెవెన్యూ, హౌసింగ్, విద్యుత్ సమస్యలతో పాటు వ్యక్తిగత ఇబ్బందులపై వినతిపత్రాలు అందజేశారు. ప్రతి ఒక్కరి సమస్యను మంత్రి ఓర్పుతో విని సంబంధిత శాఖ అధికారులతో వెంటనే మాట్లాడారు. సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు త్వరగా న్యాయం జరిగేలా బాధ్యతగా పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం ప్రజాప్రతినిధుల బాధ్యత అని తెలిపారు. ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాయచోటి నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని పేర్కొన్నారు. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.