ఆక్వా రంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి అచ్చెన్నాయుడు..
ఫీడ్, సీడ్ నాణ్యతపై కఠిన పర్యవేక్షణ చేపడతాం..
అమరావతి: రాష్ట్రంలో ఆక్వాకల్చర్ రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంతో తీసుకుంటోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖల మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఆక్వా రైతులు, ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారులు, పరిశ్రమ ప్రతినిధులతో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ సమావేశంలో మంత్రి మాట్లాడారు. ఈ సందర్భంగా రంగంలో ప్రస్తుతం ఉన్న సమస్యలు, భవిష్యత్ సవాళ్లపై ప్రభుత్వం సమగ్రంగా చర్చించినట్లు చెప్పారు.
శ్రింప్ ఫీడ్ ధరలు పెరగడం, ముడి పదార్థాల కొరత, రైతులపై పెరుగుతున్న వ్యయభారం, ఎగుమతుల్లో ఎదురవుతున్న ఇబ్బందులు వంటి అంశాలను సమావేశంలో ప్రధానంగా చర్చించినట్లు తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న వేసవి పంట సమయంలో ఫీడ్ ధరల పెంపు రైతులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు ఫీడ్ తయారీ పరిశ్రమ కూడా ముడి పదార్థాల ధరల పెరుగుదలతో ఒత్తిడిని ఎదుర్కొంటోందని పేర్కొన్నారు.
రైతుల ప్రయోజనాలు కాపాడుతూ, పరిశ్రమ కూడా నిలదొక్కుకునేలా సమతుల్య నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఆక్వా రంగ స్థిరత్వానికి పారదర్శక విధానాలు అవసరమని ఆయన అన్నారు. ఫీడ్, సీడ్ నాణ్యత విషయంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని తెలిపారు. రైతులకు నాణ్యమైన సీడ్ అందేలా CCTV ఆధారిత హ్యాచరీ పర్యవేక్షణ, సీడ్ ట్రేసబిలిటీ, IoT ఆధారిత మానిటరింగ్ వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని వెల్లడించారు.
GM సోయా దిగుమతులు, ఫిష్ మీల్ లభ్యత, దిగుమతి లైసెన్సులు, ఎగుమతి పోటీతత్వం వంటి కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వానికి సమగ్ర నివేదిక పంపనున్నట్లు మంత్రి తెలిపారు. ఆక్వా రైతుల సంక్షేమం, ఫీడ్ పరిశ్రమ స్థిరత్వం, ఎగుమతుల వృద్ధి లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని చెప్పారు.
ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం, పరిశ్రమ ప్రతినిధులు, రైతులు పరస్పర సహకారంతో ముందుకు రావాలని మంత్రి అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి. రాజశేఖర్, మత్స్యశాఖ కమిషనర్ రామ శంకర్ నాయక్, ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమరెడ్డి, AAC సభ్యులు, APSADA సభ్యులు, రైతు సంఘాలు, ఫీడ్ తయారీదారులు, ఎగుమతిదారుల సంఘాలు, పరిశ్రమ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.