స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్‌ను స్మరించిన దేశ నాయకులు..
మాతృభూమికి జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు వీర్ సావర్కర్ : అమిత్ షా..
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సావర్కర్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఘన నివాళులు అర్పించారు. దేశభక్తి, ధైర్యసాహసాలకు ప్రతీకగా నిలిచిన వీర్ సావర్కర్ జీవితాన్ని ఈ సందర్భంగా వారు స్మరించుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. వీర్ సావర్కర్ చూపిన ధైర్యం, దేశభక్తి తరతరాలకు స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన త్యాగాలు చిరస్మరణీయమన్నారు. అలాగే ఆయన మేధస్సు, సామాజిక సంస్కరణలపై చూపిన ఆసక్తి కూడా ఎంతో గొప్పదని కొనియాడారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వీర్ సావర్కర్‌కు నివాళులు అర్పిస్తూ భావోద్వేగంగా స్పందించారు. స్వాతంత్ర్య సమరంలో నిర్భయ యోధుడిగా వీర్ సావర్కర్ దేశానికి తన జీవితాన్ని అంకితం చేశారని తెలిపారు. ఆయన రచనలు, ఆలోచనలు దేశభక్తి అంటే ఏమిటో నేటి తరాలకు తెలియజేస్తాయని అన్నారు.
“ఓ మాతృభూమి… నీవు లేని జీవితం మరణంతో సమానం” అని వీర్ సావర్కర్ చెప్పిన మాటలు దేశంపై ఆయనకున్న అపారమైన ప్రేమను ప్రతిబింబిస్తాయని అమిత్ షా పేర్కొన్నారు. సమాజంలో ఉన్న అంటరానితనం వంటి సామాజిక దురాచారాలకు ఆయన గట్టిగా వ్యతిరేకించారని, దేశ ప్రజలను ఐక్యంగా నిలబెట్టేందుకు కృషి చేశారని గుర్తు చేశారు.
వీర్ సావర్కర్ జీవితం దేశసేవ, త్యాగం, సామాజిక చైతన్యానికి ప్రతీకగా నిలిచిందని, ఆయన ఆశయాలు భవిష్యత్ తరాలకు మార్గదర్శకంగా ఉంటాయని ఇద్దరు నేతలు పేర్కొన్నారు.