అమరావతిలో పుంగోల్ తరహా ఇంటిగ్రేటెడ్ టౌన్ షిప్..
భారతదేశంలోనే మోడల్ టౌన్ షిప్ గా నిర్మాణం చేపడతాం..
సింగపూర్ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమరావతి అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు. సింగపూర్‌లోని పుంగోల్ జిల్లా తరహాలో అమరావతిలో ఆధునిక ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు కేవలం ఆంధ్రప్రదేశ్‌కే కాకుండా దేశవ్యాప్తంగా ఆదర్శ టౌన్‌షిప్‌గా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
సింగపూర్‌లో నిర్వహించిన జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు సహకారం తీసుకోవాలని, ప్రాజెక్టుల అమలులో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు. అమరావతి అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే పెట్టుబడిదారులను ఆహ్వానిస్తూ RFP నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వెల్లడించారు. అమరావతికి ఇప్పుడు జాతీయ స్థాయిలో చట్టబద్ధత లభించిందని, దీంతో పెట్టుబడిదారుల్లో విశ్వాసం మరింత పెరుగుతుందని అన్నారు.
ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ తరహాలో గ్లోబల్ MICE (Meetings, Incentives, Conferences, Exhibitions) గమ్యస్థానంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి తెలిపారు. ఇందుకోసం సింగపూర్‌లోని ప్రసిద్ధ సన్‌టెక్ సిటీ నమూనాను అధ్యయనం చేయనున్నట్లు చెప్పారు. అలాగే ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో వాణిజ్య అవకాశాలను విస్తరించడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వివరించారు.
రియల్ టైమ్ గవర్నెన్స్ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు సింగపూర్ అనుభవాన్ని ఉపయోగించుకుంటామని లోకేష్ చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలకు అనుకూల వాతావరణం కల్పిస్తామని హామీ ఇచ్చారు.
సింగపూర్ ప్రభుత్వంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బలమైన భాగస్వామ్యం ఏర్పడిందని ఆయన తెలిపారు. గతంలో కుదిరిన అవగాహన ఒప్పందాల అమలుపై ప్రతి నెలా వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఇటీవల సింగపూర్‌లో నిర్వహించిన SAGE కార్యక్రమంలో ఏపీకి చెందిన ఆరుగురు మంత్రులు పాల్గొని పరిపాలనపై శిక్షణ పొందారని చెప్పారు. అలాగే 37 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా శిక్షణ పూర్తి చేసుకున్నారని, అక్కడ నేర్చుకున్న అంశాలను రాష్ట్ర విద్యా వ్యవస్థలో అమలు చేస్తామని పేర్కొన్నారు.
గత నవంబర్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సింగపూర్ ప్రభుత్వం మధ్య ఇంటిగ్రేటెడ్ మోడల్ టౌన్‌షిప్, అమరావతి ఎకనామిక్ రీజియన్, డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్, రియల్ టైమ్ గవర్నెన్స్ అంశాలపై అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం అమలును పర్యవేక్షించేందుకు జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ, జాయింట్ ఇంప్లిమెంటేషన్ వర్కింగ్ కమిటీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న అంశాల పురోగతిని సమీక్షిస్తూ భవిష్యత్ కార్యాచరణపై సింగపూర్‌లో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో సింగపూర్ వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి గాన్ సియో హువాంగ్ తో పాటు పలువురు సింగపూర్ ప్రభుత్వ అధికారులు, భారత హైకమిషనర్ శిల్పక్ అంబులె, ఏపీ ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.