- తొలిసారి అసెంబ్లీకి హాజరైన టీవీకే సభ్యులు.. కొత్త ప్రభుత్వానికి ప్రొటెం స్పీకర్ సూచనలు..
- Politics: పెరంబూర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ, తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా..
CM Vijay: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం ఆరంభమైన వేళ, నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత సి. జోసెఫ్ విజయ్ సోమవారం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్తగా కొలువుదీరిన 17వ తమిళనాడు అసెంబ్లీ తొలి సమావేశాల్లో భాగంగా ప్రొటెం స్పీకర్ కరుప్పియా నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలందరితో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణం చేసిన తదుపరి రోజే శాసనసభలో సభ్యుడిగా అడుగుపెట్టడం విశేషం. ఈ సందర్భంగా విజయ్ అనుసరించిన ప్రమాణ స్వీకార పద్ధతి రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన సమయంలో దైవసాక్షిగా ("ఆండవన్ మీదు ఆనైయగ") అని పేర్కొన్న ఆయన, ఎమ్మెల్యేగా ప్రమాణం చేసే సమయంలో మాత్రం తన మనస్సాక్షిగా ("ఉలమార ఉరుది కూరుగిరేన్") ధ్రువీకరిస్తున్నట్లు రాజ్యాంగబద్ధంగా ప్రకటించారు.
ఇటీవలి ఎన్నికల్లో విజయ్ పెరంబూర్ మరియు తిరుచి ఈస్ట్ అనే రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే, చట్టసభ నిబంధనల ప్రకారం ఆయన పెరంబూర్ నియోజకవర్గ ప్రతినిధిగా కొనసాగాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో తిరుచి ఈస్ట్ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఆ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. విజయ్‌తో పాటు టీవీకే పార్టీకి చెందిన కీలక నేతలు ఎన్. ఆనంద్ మరియు ఆధవ్ అర్జున కూడా ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేశారు. తొలిసారి రాష్ట్ర పీఠాన్ని అధిరోహించిన ఉత్సాహంతో టీవీకే సభ్యులంతా సభలో సందడి చేశారు.
ఈ చారిత్రాత్మక ఘట్టం సందర్భంగా ప్రొటెం స్పీకర్ కరుప్పియా నూతన సభ్యులకు దిశానిర్దేశం చేశారు. అనేక రాజకీయ సవాళ్లను దాటుకుని ప్రజల నమ్మకాన్ని గెలుచుకున్న కొత్త నాయకత్వంపై గురుతర బాధ్యత ఉందని ఆయన గుర్తుచేశారు. శాసనసభ్యులు కేవలం అధికారానికే పరిమితం కాకుండా ప్రజల సేవకులుగా మెలగాలని ఆయన ఆకాంక్షించారు. పెరియార్, కామరాజర్ వంటి మహనీయుల ఆశయాలను, సామాజిక న్యాయ సూత్రాలను తూచా తప్పకుండా పాటిస్తూ రాష్ట్ర పురోగతికి తోడ్పడాలని పిలుపునిచ్చారు. 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించిన టీవీకే, మిత్రపక్షాల అండతో సుస్థిర పాలన అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.