దేశాభివృద్ధిలో సైబరాబాద్ నగరం కీలకపాత్ర పోషిస్తోంది..
ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ కేంద్రంగా మారింది..
హైదరాబాద్: తెలంగాణ అభివృద్ధి దేశ ప్రగతికి కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న ఆయన, సైబరాబాద్ సామర్థ్యం అంతర్జాతీయ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. దేశ ఆర్థికాభివృద్ధిలో హైదరాబాద్ కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు.
ఈ కార్యక్రమాల ద్వారా యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని ప్రధాని తెలిపారు. ప్రస్తుతం ఉద్యోగ అవకాశాలకు హైదరాబాద్ ప్రధాన కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. తెలంగాణలో పరిశ్రమలు, ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ఆయన అన్నారు.
వరంగల్‌లో ఏర్పాటు చేస్తున్న పీఎం మిత్ర టెక్స్‌టైల్ పార్క్ దేశ టెక్స్‌టైల్స్ రంగానికి కొత్త ఊపును తీసుకువస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా తెలంగాణలో పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా రోడ్లు, రైల్వేలు, ఎయిర్‌పోర్టుల కనెక్టివిటీ పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని వివరించారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణ గతంతో పోలిస్తే రెట్టింపు అయిందని తెలిపారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని ఉద్దేశించి “నా మాట శ్రద్ధగా వినండి” అంటూ ప్రధాని వ్యాఖ్యానించడం సభలో ఆసక్తికరంగా మారింది. 2014కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రైల్వే బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయల కంటే తక్కువ నిధులు వచ్చేవని, ఇప్పుడు తెలంగాణకే రూ.5,500 కోట్లను రైల్వే పనులకు కేటాయించామని చెప్పారు.
ప్రస్తుతం తెలంగాణలో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన రైల్వే పనులు కొనసాగుతున్నాయని ప్రధాని వెల్లడించారు. రాష్ట్రానికి ఇప్పటికే ఐదు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు అందించామని, అదనంగా ఆరు అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా మంజూరు చేశామని తెలిపారు.
“తెలంగాణ అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుంది” అని ప్రధాని స్పష్టం చేశారు. రాజకీయాల గురించి మాట్లాడనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారని, తాను కూడా రాజకీయాల జోలికి వెళ్లబోనని మోదీ వ్యాఖ్యానించారు.
గత పదేళ్లలో గుజరాత్‌కు ఎంత ప్రాధాన్యం ఇచ్చామో, తెలంగాణకు కూడా అంతే స్థాయిలో నిధులు, అభివృద్ధి అవకాశాలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.