ల్యాండింగ్ సమయంలో ఎయిర్‌బస్‌లో మంటలు..
కాఠ్‌మాండూ విమానాశ్రయంలో ఉద్రిక్తత..
నేపాల్ రాజధాని కాఠ్‌మాండులో పెను విమాన ప్రమాదం తృటిలో తప్పింది. ఇస్తాంబుల్ నుంచి వచ్చిన ఎయిర్‌బస్-300 విమానం ల్యాండింగ్ అవుతున్న సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే విమాన సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు.
విమానాశ్రయ అధికారుల వివరాల ప్రకారం, విమానం కాఠ్‌మాండులోని త్రిభువన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుండగా కుడివైపు ల్యాండింగ్ గేర్ వద్ద మంటలు కనిపించాయి. వెంటనే పైలట్ అత్యవసర పరిస్థితిని ప్రకటించగా, ఎయిర్‌పోర్ట్ అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు.
మరోవైపు, విమాన సిబ్బంది చాకచక్యంగా స్పందించి ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారానే ప్రయాణికులను వేగంగా బయటకు దించారు. ప్రమాద సమయంలో విమానంలో మొత్తం 277 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందరూ క్షేమంగా బయటపడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టైంది.
అగ్నిమాపక సిబ్బంది కొద్ది నిమిషాల్లోనే మంటలను అదుపులోకి తీసుకురావడంతో పరిస్థితి సాధారణమైంది. ఈ ఘటనతో విమానాశ్రయంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఘటనపై విమానాశ్రయ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. ల్యాండింగ్ గేర్‌లో సాంకేతిక లోపమే మంటలకు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.