డైరెక్టర్ రాజమౌళి ఇటీవల ‘వారణాసి’ ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదానికి దారి తీసాయి. ‘నాకు దేవుడిపై పెద్దగా నమ్మకం లేదు’ అని ఆయన చెప్పిన క్రమంలో, హనుమాన్‌పై నమ్మకం వ్యక్తం చేసిన తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాటలను ప్రస్తావించినప్పుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో అనేక మంది నెటిజన్లు రాజమౌళిపై విమర్శలు చేస్తుండగా, ఇప్పుడు BJP నేత మాధవీలత కూడా స్పందించారు. రాజమౌళి లాంటి ప్రముఖులు మాట్లాడే ప్రతి మాటకు బాధ్యత ఉంటుందని, కోట్లాది మంది యువత ఆయనను ఆదర్శంగా తీసుకుంటారని, కాబట్టి వ్యాఖ్యలు చేసే విషయంలో మరింత బాధ్యత అవసరమని ఆమె సూచించారు.
మాధవీలత మాట్లాడుతూ, "మీ సినిమాలో గ్లింప్స్ విడుదలకు టెక్నికల్ సమస్యలు వచ్చాయన్న కారణంతో వెంటనే హనుమంతుడిని ఎందుకు లాగుతున్నారు? ఒక చిన్న సాంకేతిక లోపాన్ని దేవుడి పేరు పెట్టి ఎలా అనుకుంటారు?" అని ప్రశ్నించారు. రాజమౌళి వ్యాఖ్యల్లో దేవుడిపై నమ్మకం లేదని చెప్పడం కన్నా, ఆ వ్యాఖ్యలు చెప్పిన సందర్భం మరింత అనూహ్యంగా ఉన్నాయని ఆమె అభిప్రాయపడింది. ప్రజలకు, ముఖ్యంగా యువతకు మీరు ఒక స్ఫూర్తి ప్రదాతని, మీలాంటి వ్యక్తులు చెప్పే ప్రతి మాట వారికి ఒక సందేశంగా మారుతుందని పేర్కొన్నారు. వ్యక్తిగత విశ్వాసం ఏదైనా ఉన్నా, తమ మాటల వల్ల సమాజంపై పడే ప్రభావం గుర్తుంచుకోవడం అవసరమని ఆమె హితవు పలికారు.
ఇక సోషల్ మీడియాలో రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది ఆయనను సమర్థిస్తుంటే, మరికొందరు సినిమాల ప్రమోషన్ ఈవెంట్‌లో దేవుడి పేరు అనవసరంగా ప్రస్తావించడం సరికాదని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా హనుమాన్ వంటి కోటి మందికి ఆరాధ్య దేవుడి పేరు ఇటువంటి సందర్భంలో తేలికగా తీసుకోవడం ప్రజలను బాధించిందని వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు రాజమౌళి అభిమానులు మాత్రం ఆయన మాటలను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని, ఆయన భావన సాంకేతిక లోపం వల్ల కలిగిన అసహనం మాత్రమేనని అంటున్నారు.
సినీ పరిశ్రమలో ప్రముఖుడిగా రాజమౌళి స్థానాన్ని గుర్తుచేసుకుంటూ, ప్రజల అభిప్రాయాలను కూడా గౌరవించాలనే సూచనలతో ఈ వివాదం ముందుకు సాగుతోంది. ఇక ఈ నేపథ్యంలో రాజమౌళి మరోసారి స్పందిస్తారా? తన వ్యాఖ్యలను వివరిస్తారా? అనే ఆసక్తి నెటిజన్లలో పెరుగుతోంది. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారి సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతోంది.