భారత ప్రభుత్వం కొత్త తరహా ఈ-పాస్‌పోర్ట్‌లను ప్రారంభించింది. ఈ కొత్త ఈ-పాస్‌పోర్ట్‌లు అత్యాధునిక భద్రతా వ్యవస్థలతో వస్తాయి. వీటిలో ఇంటర్‌లాకింగ్ మైక్రోలెటర్లు, రిలీఫ్ టింట్స్, అలాగే వ్యక్తిగత మరియు బయోమెట్రిక్ డేటాను భద్రపరిచే RFID చిప్ ఉంటుంది. ఈ డిజైన్‌ను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. ఇకపై జారీ చేసే అన్ని పాస్‌పోర్ట్‌లు ఈ-పాస్పోర్ట్లుగానే ఉంటాయి. ప్రస్తుతం ఉన్న సాధారణ పాస్‌పోర్ట్‌లు గడువు ముగిసే వరకు చెల్లుతాయి.
ఈ-పాస్‌పోర్ట్‌లో ఉండే RFID చిప్ వ్యక్తి యొక్క ఫోటో, వేలిముద్రలు వంటి బయోమెట్రిక్ వివరాలను ఎన్‌క్రిప్ట్ చేసిన రూపంలో భద్రపరుస్తుంది. ఈ చిప్‌ను ఇమిగ్రేషన్ కౌంటర్ వద్ద యంత్రాలు కాంటాక్ట్ లేకుండా స్కాన్ చేస్తాయి. దీంతో చెక్ చేసే సమయం తగ్గుతుంది, నకిలీ పాస్‌పోర్ట్‌లను గుర్తించడం సులభం అవుతుంది. ఇప్పటి వరకు భారత్‌లో 80 లక్షల ఈ-పాస్‌పోర్ట్‌లు, విదేశీ దౌత్య కార్యాలయాల ద్వారా 60,000 పాస్‌పోర్ట్‌లు జారీ చేశారు.
పాస్‌పోర్ట్ సేవల వ్యవస్థను మరింత ఆధునీకరించడానికిగాను ప్రభుత్వం ‘పాస్‌పోర్ట్ సేవా 2.0’ ను ప్రారంభించింది. ఈ సరికొత్త సిస్టమ్ AI ఆధారిత చాట్బాట్లు, వాయిస్బాట్లు, ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్, ఆటో-ఫిల్ ఫారమ్‌లు, UPI/QR పేమెంట్స్ వంటి ఫీచర్లను అందిస్తుంది. అదనంగా, ఆధార్, పాన్, డిజీలాకర్‌తో ఈ సర్వీస్ నేరుగా అనుసంధానం చేయబడింది. తద్వారా పత్రాలను చెక్ చేయడం వేగంగా జరుగుతుంది.
భద్రతను పెంచేందుకు అడ్వాన్స్ బయోమెట్రిక్స్, ఫేస్ రికగ్నిషన్, AI అలర్ట్స్, డేటా అనలిటిక్స్ వంటి టెక్నాలజీలు కూడా ఈ వ్యవస్థలో చేరాయి. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ (RPA) కూడా ఉపయోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా 17 భాషల్లో సేవలు అందించే నేషనల్ కాల్ సెంటర్ పనిచేస్తోంది. నోయిడా, చెన్నై, బెంగళూరు నగరాల్లో అత్యాధునిక డేటా సెంటర్లను ఏర్పాటు చేశారు.
ప్రతి సంవత్సరం 1.5 కోట్లు పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తున్న MEA ఈ కొత్త వ్యవస్థతో సేవలు మరింత వేగవంతమయ్యాయి అంటోంది. దేశంలోని దూర ప్రాంతాలకు చేరుకోవడానికి మొబైల్ పాస్‌పోర్ట్ సేవా వాన్లను కూడా ప్రవేశపెట్టారు. ప్రస్తుతం 543 లోక్‌సభ నియోజకవర్గాల్లో 32 చోట్ల మాత్రమే పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు లేవు. ఆ ప్రాంతాలను కూడా వచ్చే ఆరు నెలల్లో కవర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.