ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు నూతన సంవత్సరం, సంక్రాంతి కానుకగా శుభవార్త అందించింది. రాష్ట్రంలో కిలో గోధుమ పిండిని కేవలం రూ.20కే అందించే కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పంపిణీ నేటి నుంచే ప్రారంభమై, ముందుగా పట్టణ ప్రాంతాల్లో అమలు చేసి, అనంతరం గ్రామీణ ప్రాంతాలకు విస్తరించనుంది.
ఇప్పటికే రేషన్ షాపుల ద్వారా బియ్యం, చక్కెరతో పాటు రాగులు, జొన్నలు వంటి చిరుధాన్యాలను అందిస్తున్న ప్రభుత్వం, ఇప్పుడు గోధుమ పిండిని కూడా నిత్యావసర సరుకుల జాబితాలో చేర్చింది. బహిరంగ మార్కెట్‌లో కిలో గోధుమ పిండి ధర రూ.60 నుంచి రూ.65 వరకు ఉండగా, చౌక ధర దుకాణాల్లో కేవలం రూ.20కే అందించడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలకు పెద్ద ఊరట లభించనుంది.
రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకునే సమయంలో కావాలనుకుంటే కొంత బియ్యాన్ని తగ్గించి, ఆ స్థానంలో రాగులు లేదా జొన్నలు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది. డిసెంబర్ నుంచే జొన్నలు, రాగుల పంపిణీ ప్రారంభమైంది. దీనివల్ల ప్రజల ఆహారంలో వైవిధ్యం పెరిగి, పోషకాహారం అందుబాటులోకి వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది.
మరోవైపు రేషన్ వ్యవస్థను మరింత ప్రజానుకూలంగా మార్చేందుకు ప్రభుత్వం చౌక ధర దుకాణాలను ‘మినీ మాల్స్’గా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతం నెలలో కొన్ని రోజులు, పరిమిత సమయాల్లో మాత్రమే తెరిచి ఉండే రేషన్ షాపులను, రోజుకు సుమారు 12 గంటల పాటు పూర్తిస్థాయిలో తెరిచి ఉంచేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ విధానాన్ని మొదట పైలట్ ప్రాజెక్టుగా కొన్ని పట్టణాల్లో అమలు చేయనున్నారు.
మినీ మాల్స్‌గా మారిన రేషన్ షాపుల్లో బియ్యం మాత్రమే కాకుండా, ఇతర నిత్యావసర సరుకులు కూడా అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనివల్ల లబ్ధిదారులకు సౌకర్యం కలగడంతో పాటు, రేషన్ డీలర్లకు కూడా స్థిరమైన ఉపాధి లభించనుంది. ఈ పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసే అవకాశముందని అధికారులు తెలిపారు.