Telangana Special Buses: తెలుగువారి కొత్త ఏడు ఉగాది, ముస్లిం సోదరుల పవిత్ర పండుగ రంజాన్ ఒకదాని వెనుక ఒకటి వస్తుండటంతో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) కీలక నిర్ణయం తీసుకుంది. పండుగలకు సొంతూళ్లకు వెళ్లే వారి కోసం భారీగా ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, ఈ స్పెషల్ బస్సుల్లో ప్రయాణించే వారు జేబుకు కొంచెం అదనంగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది.
పండుగ సీజన్ కావడంతో మార్చి 17, 18 తేదీలతో పాటు, తిరుగు ప్రయాణం ఎక్కువగా ఉండే మార్చి 23న ప్రయాణికుల తాకిడి విపరీతంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రద్దీని తట్టుకోవడానికి నడిపే 'స్పెషల్ బస్సుల్లో' సాధారణం కంటే 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయనున్నారు. ప్రభుత్వం 2023లో విడుదల చేసిన జీవో నంబర్ 16 ప్రకారం.. డీజిల్ ఖర్చులు, నిర్వహణ భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ధరల సవరణ చేస్తున్నట్లు సంస్థ స్పష్టం చేసింది. అయితే, రెగ్యులర్ బస్సుల్లో ప్రయాణించే వారికి పాత ధరలే వర్తిస్తాయని, కేవలం అదనంగా వేసిన బస్సులకు మాత్రమే ఈ పెంపు ఉంటుందని అధికారులు క్లారిటీ ఇచ్చారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న 'మహాలక్ష్మి' పథకం వల్ల మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం ఉండటంతో బస్సులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. దీనికి తోడు పాత బస్సులు తరచూ మొరాయిస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా సుమారు 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను కొనుగోలు చేసే ప్రక్రియను వేగవంతం చేసింది. పర్యావరణ హితంగా ఉండే ఈ బస్సులు వస్తే అటు కాలుష్యం తగ్గడంతో పాటు ఇటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది.
కొత్త ఎలక్ట్రిక్ బస్సుల సరఫరా కోసం ఇప్పటికే ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, గ్రీన్‌సెల్ మొబిలిటీ వంటి సంస్థలకు లెటర్ ఆఫ్ అవార్డ్ ఇచ్చారు. ఈ ఏడాది సెప్టెంబర్ (2026) నుండి ప్రారంభించి 2027 ఆగస్టు నాటికి ఈ 2 వేల బస్సులు విడతల వారీగా రోడ్లపైకి రానున్నాయి. ఇప్పటికే హైదరాబాద్‌తో పాటు పలు జిల్లా కేంద్రాల్లో ఎలక్ట్రిక్ బస్సులు సక్సెస్‌ఫుల్‌గా నడుస్తుండటంతో, భవిష్యత్తులో డీజిల్ బస్సుల స్థానంలో వీటినే ఎక్కువగా వాడాలని ఆర్టీసీ భావిస్తోంది. దీనివల్ల సంస్థకు నిర్వహణ ఖర్చులు కూడా తగ్గే అవకాశం ఉంది.
పండుగ సమయంలో చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ప్రయాణికులు ఆర్టీసీ వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా ముందస్తుగా సీట్లు రిజర్వ్ చేసుకోవాలని అధికారులు కోరుతున్నారు. తెలంగాణ పరిధిలోనే కాకుండా పొరుగు రాష్ట్రాలకు వెళ్లే స్పెషల్ బస్సులకు కూడా ఈ 50 శాతం అదనపు ఛార్జీలు వర్తిస్తాయని తెలిపారు. మొత్తం మీద పండుగ వేళ ఇంటికి వెళ్లే ప్రయాణికులకు సీటు దొరుకుతుందన్నది ఒక ఊరట ఇచ్చే వార్త అయితే, అదనపు బాదుడు మాత్రం సామాన్యుడికి కాస్త భారమే అని చెప్పాలి.