ఇండియాలో ఇండిగో ఫ్లైట్ సంక్షోభం ఇంకా తగ్గలేదు. ఐదురోజులు గడిచినా పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదు. విమానాశ్రయాలు కుంభమేళాలను తలపించేంతగా రద్దీగా మారాయి. టెర్మినల్స్ లోపల ప్రయాణీకులు గంటల తరబడి వరుసల్లో నిలబడి అసహనంతో ఉన్నారు. ఇండిగో కౌంటర్ల దగ్గర పెద్ద ఎత్తున వాగ్వాదాలు, అరుపులు, కన్నీళ్లు కనిపిస్తున్నాయి.
ఈ గందరగోళానికి అసలు కారణం పైలెట్ల కొరత. DGCA నియమాలు మార్చినా సమస్య తగ్గలేదు. విమానాలు రద్దవుతుండడంతో ప్రయాణీకులు ఎక్కడ ఉండాలి, నీరు, ఆహారం వంటి బేసిక్ సౌకర్యాలు ఎక్కడ దొరుకుతాయి? అత్యవసరం ఉన్న వాళ్లు ఎలా వెళ్లాలి? అన్న అయోమయం పెరిగిపోయింది. ఎక్కువ మంది వృద్ధులు, చిన్న పిల్లలతో ఉన్న కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇండిగో మేనేజ్‌మెంట్ క్షమాపణ చెప్పినా ప్రజలకు ఎలాంటి ఉపశమనం లేదు. ప్రయాణీకులు అత్యధిక అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఉన్న సర్వీసులు రద్దు చేస్తున్నా, కొత్త సర్వీసులకు మాత్రం టిక్కెట్లు అమ్మడం వల్ల కోపం మరింత పెరిగింది. “విమానాలు లేనప్పుడు బుకింగ్స్ ఎందుకు?” అనే ప్రశ్నతో ప్రజలు తీవ్రంగా ఆక్రోశిస్తున్నారు.
ఈ సంక్షోభం దేశం మొత్తం దృష్టిని ఆకర్షించింది. ఇంత పెద్ద ఎయిర్‌లైన్ ఇలాంటి గందరగోళం సృష్టించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రయాణీకులు కనీస సేవలు కూడా అందించకుండా, మేనేజ్‌మెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. లగేజీతో గంటల తరబడి నిలబడటం, నిద్రించే చోటు లేకపోవడం వంటి అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారు.
ఇంకా, ఈ పరిస్థితులపై ప్రభుత్వం ఏమి చేస్తోంది? ఇండిగోపై ఎందుకు కంట్రోల్ తీసుకోలేకపోతున్నారు? విమానయాన శాఖ ఏమి చర్యలు తీసుకుంటుంది? అనే ప్రశ్నలపై దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్నాయి. సమస్య పరిష్కారమయ్యే వరకు ప్రయాణీకులు తీవ్రమైన ఇబ్బందులు తప్పవని నిపుణులు చెబుతున్నారు.