రైల్వే శాఖ తిరుపతి–షిర్డీ ప్రయాణీకులకు కీలక సమాచారం ఇచ్చింది. తిరుపతి నుండి సాయినగర్ షిర్డీ వరకు కొత్త వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఇండిగో విమానాల సమస్య కారణంగా ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాలకు రైళ్ల డిమాండ్ పెరగడంతో అదనపు ప్రత్యేక రైళ్లు నడపాలని నిర్ణయించింది. దీంతో ప్రయాణికులకు మరిన్ని ప్రయాణ అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
తిరుపతి–సాయినగర్ షిర్డీ (17425/17426) వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు డిసెంబర్ 14 నుండి ప్రతి ఆదివారం నడవనుంది. ప్రారంభ ప్రత్యేక సర్వీసులు మాత్రం డిసెంబర్ 9 మరియు 10 తేదీల్లో నడుస్తాయి. 9వ తేదీన తిరుపతి–షిర్డీ (07425), 10వ తేదీన షిర్డీ–తిరుపతి (07426) ప్రత్యేక రైళ్లు నడుస్తాయని అధికారులు తెలిపారు. ఈ కొత్త రైలుకు రైల్వే బోర్డు ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, గుంటూరు, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్ తదితర ముఖ్య స్టేషన్ల మీదుగా ప్రయాణించి షిర్డీ చేరుతుంది. తిరుగు ప్రయాణం సోమవారం షిర్డీ నుండి ప్రారంభమవుతుంది. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రయాణీకులకు షిర్డీ చేరడం మరింత సులభం కానుంది.
ఇక ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా చర్లపల్లి టెర్మినల్ నుండి కూడా రెండు ప్రత్యేక రైళ్లు నడపనున్నారు. డిసెంబర్ 6న రాత్రి 9:35కి చర్లపల్లి–తిరుపతి రైలు, 26న రాత్రి 10:40కి చర్లపల్లి–నర్సాపూర్ రైలు బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్పష్టంచేశారు. ఈ రైళ్లు పలు మధ్యస్థ హాల్టింగ్ స్టేషన్లలో ఆగుతాయి.
తిరుపతి రైలుకు మల్కాజిగిరి, కాచిగూడ, షాద్‌నగర్, మహబూబ్‌నగర్, గద్వాల్, గుత్తి, కడప వంటి స్టేషన్లలో ఆగే అవకాశం ఉంది. నర్సాపూర్ రైలుకు నల్లగొండ, గుంటూరు, విజయవాడ, గుడివాడ, ఆకివీడు, భీమవరం, పాలకొల్లు వంటి ప్రధాన స్టేషన్లలో హాల్ట్స్ ఉంటాయి. ఈ నిర్ణయాలతో ప్రయాణీకులకు మరింత సౌకర్యం కలగనున్నట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.