యూఎస్ పర్యటన నాలుగో రోజు భాగంగా రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికాలోని సాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అడోబ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శంతను నారాయణన్‌తో సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో టెక్నాలజీ, పరిశోధన మరియు ఆరోగ్య రంగాల్లో పెట్టుబడుల అవకాశాలపై విస్తృత చర్చలు జరిపారు. లోకేష్ మాట్లాడుతూ విశాఖపట్నంలో అడోబ్ జీసీసీ (గ్లోబల్ కేపబిలిటీ సెంటర్) లేదా డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరారు.
గ్లోబల్ కంపెనీలు భారతదేశంలో కొత్త కేంద్రాలు ప్రారంభిస్తే ఉపాధి అవకాశాలు మాత్రమే కాక, స్థానిక యువతకు ప్రపంచ స్థాయి ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం లభిస్తుందని ఆయన వివరించారు. అడోబ్ వంటి టెక్ దిగ్గజం వచ్చి పనిచేస్తే విశాఖపట్నం అంతర్జాతీయ ఐటీ మ్యాప్‌లో మరింత స్థానం సంపాదిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇంటెల్, ఏఎండీ, అప్లైడ్ మెటీరియల్స్ వంటి ప్రముఖ అమెరికా టెక్ కంపెనీలతో అనుసంధానించే దిశగా అడోబ్ సహకరించాలని కోరారు.
రాష్ట్రం ఫ్యాబ్‌లెస్ డిజైన్, ఎలక్ట్రానిక్ తయారీ, పరిశోధన, డిజిటల్ ఇన్నోవేషన్ రంగాల్లో ఎదగడానికి గ్లోబల్ స్థాయి భాగస్వామ్యం అవసరమని ఆయన తెలిపారు. రాష్ట్రంలో అందుబాటులో ఉన్న నైపుణ్యమైన పనిదనం, ప్రోత్సాహక విధానాలు, విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో అభివృద్ధి అవకాశాలు పెట్టుబడిదారులకు ఆకర్షణీయంగా ఉంటాయని లోకేష్ వివరించారు.
అదేవిధంగా లోకేష్ శంతను నారాయణన్‌కి ఆయన డైరెక్టర్‌గా ఉన్న ఫైజర్ సంస్థ పెట్టుబడుల గురించి కూడా సూచించారు. విశాఖపట్నంలోని ఏఎంటీజ్డ్ (ఆంధ్ర ప్రదేశ్ మెడ్ టెక్ జోన్) వంటి ఫార్మా పరిశ్రమ జోన్లలో వ్యాక్సిన్ తయారీ ప్లాంట్లు, బయోలాజిక్స్, చిన్న మాలిక్యూల్స్ పరిశోధన కేంద్రాలు ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలోని ఫార్మా క్లస్టర్లతో కలిసి క్లినికల్ ట్రయల్స్, వ్యాధులపై అధ్యయనాలు, డిజిటల్ హెల్త్ పైలట్ ప్రాజెక్టులు వంటి రంగాల్లో ఫైజర్ భాగస్వామ్యం వహిస్తే దేశవ్యాప్తంగా పెద్ద మార్పు తీసుకురావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.
అదనంగా కెకెఆర్ అనే ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ ఆరోగ్య రంగం, బయో ఫార్మాస్యూటికల్స్, ఎర్నజీ సిస్టమ్స్ వంటి విభాగాల్లో భారీ పెట్టుబడులు పెట్టే సంస్థ అని గుర్తు చేశారు. కెకెఆర్‌కు సుమారు USD 750 బిలియన్ పెట్టుబడి సామర్థ్యం ఉందని, ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య సంరక్షణ రంగంలో అవకాశాలు విస్తరించి ఉన్నాయని, ఆసుపత్రులు, పరిశోధన శాలలు, ఔషధ పరిశ్రమలకు పెట్టుబడులు రావడానికి రాష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
ఈ ప్రతిపాదనలపై అడోబ్ సీఈవో శంతను నారాయణన్ స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వ సూచనలను తన సహచరులతో సమీక్షించి, పెట్టుబడులపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెక్నాలజీ, ఫార్మా, పరిశోధన రంగాల్లో ముందుకు సాగేందుకు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు