మొబైల్ సిగ్నల్ సమస్యలు అధికంగా గ్రామాల్లోనే చూస్తూ ఉంటాం నేటికీ ప్రజల మొబైల్ సిగ్నల్స్ లేక ఇబ్బంది పడుతూనే ఉంటున్నారు. ఫోన్‌లో మాట్లాడుతుంటే మాట మధ్యలోనే కట్ కావడం, అత్యవసర సమయంలో కాల్ కలవకపోవడం, ఇంటర్నెట్ పూర్తిగా పనిచేయకపోవడం వంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రస్తుత రోజుల్లో కూడా చూస్తున్నాం . ప్రపంచం మొత్తం 5జీ వైపు పరుగులు పెడుతుంటే, కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ఇంకా కనీస స్థాయి నెట్‌వర్క్ కూడా అందక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు . ఈ పరిస్థితిని గమనించిన రాష్ట్ర ప్రభుత్వం సిగ్నల్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 707 మొబైల్ టవర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ‘డిజిటల్ భారత్ నిధి’ పథకం కింద ఈ టవర్ల నిర్మాణానికి అవసరమైన వ్యయాన్ని కేంద్రం భరిస్తుండగా, టవర్ల ఏర్పాటు కోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చనుంది. ఈ ప్రాజెక్టులో ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNLతో పాటు ప్రైవేటు టెలికాం సంస్థలు Airtel మరియు Jio కూడా భాగస్వాములుగా టవర్లను ఏర్పాటు చేయనున్నాయి. దీని వల్ల ప్రభుత్వ, ప్రైవేటు రంగాల సమన్వయంతో గ్రామీణ ప్రాంతాలకు నెట్‌వర్క్ సేవలు చేరనున్నాయి.
ప్రస్తుతం గ్రామాల్లో మొబైల్ వినియోగదారుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. టవర్లు పెరిగిన వినియోగానికి సరిపోవడం లేదు. ఫలితంగా సిగ్నల్ బలహీనంగా మారి కాల్స్ డ్రాప్ అవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అటవీ గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రమైంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరచూ సిగ్నల్ సమస్యలు ఎదురవుతున్న ప్రాంతాలను గుర్తించి అక్కడ అదనపు టవర్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది . ఇందుకోసం రెవెన్యూ భూములతో పాటు అవసరమైన చోట్ల అటవీ భూముల వినియోగంపై కూడా అధికారికంగా పరిశీలన జరుగుతోంది.
కొన్ని గ్రామాల్లో టవర్లకు అవసరమైన సామగ్రిని తరలించేందుకు సరైన రహదారులు కూడా లేవు. ఇది టవర్ల నిర్మాణాన్ని కష్టతరం చేస్తున్న ప్రధాన సమస్యగా మారింది. అయినప్పటికీ అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషిస్తూ పనులు ముందుకు తీసుకెళ్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ సమస్య తీవ్రంగా ఉండటంతో అక్కడ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఆ జిల్లాలోనే సుమారు 100 కొత్త టవర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే పలు లొకేషన్లలో జాయింట్ సర్వే పూర్తవగా, కొన్ని చోట్ల టవర్ల నిర్మాణానికి స్థలాలను ఆయా సంస్థలకు అప్పగించారు.
రాష్ట్రవ్యాప్తంగా 4జీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయడానికి మరో 624 కొత్త టవర్ల ప్రతిపాదనను ప్రభుత్వం సిద్ధం చేసింది. కొత్త జిల్లాల ప్రాతిపదికన టవర్ల స్థలాలను గుర్తిస్తూ అధికారులు వేగంగా సర్వేలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే వందలాది ప్రాంతాల్లో సంయుక్త సర్వే పూర్తవడం ఈ ప్రక్రియ ఎంత వేగంగా సాగుతోందో సూచిస్తోంది.
ఈ టవర్లు పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంభిస్తే గ్రామీణ ప్రాంతాలలో అత్యవసర సేవలు, విద్య, ఆరోగ్యం, ఆన్‌లైన్ సేవలు, ప్రభుత్వ పథకాల సమాచారం వంటి అంశాల్లో మొబైల్ నెట్‌వర్క్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇన్నాళ్లూ సిగ్నల్ కోసం కొండ ఎక్కడం ఇంటి బయటికి రావడం వంటి కష్టాలు పడిన ప్రజలకు ఇక ఆ పరిస్థితి ఉండదని నిపుణులు చెబుతున్నారు. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమన్వయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం మారుమూల గ్రామాలకు డిజిటల్ ప్రపంచాన్ని మరింత దగ్గర చేయనుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.