Kharif Season 2026: ఖరీఫ్ సీజన్‌కు లైన్ క్లియర్.. ఎరువుల కొరతపై కేంద్రం కీలక ప్రకటన.!!
Telangana Agriculture News: తెలంగాణలో వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న రైతులకు కేంద్రం తీపి కబురు చెప్పింది. అంతర్జాతీయంగా ధరలు పెరిగినప్పటికీ దేశంలో ఎరువుల ధరలు పెంచబోమని, సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేసింది
Telangana Agriculture News: వానాకాలం సాగుకు సిద్ధమవుతున్న అన్నదాతలకు ఊరటనిచ్చే వార్త ఇది. అంతర్జాతీయంగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నప్పటికీ, దేశంలో ఎరువుల కొరత రాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పక్కా ప్రణాళికతో అడుగులు వేస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈసారి యూరియా నిల్వలు అధికంగా ఉండటంతో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
పశ్చిమాసియాలో ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ఎరువుల ధరలు 12 నుండి 40 శాతం వరకు పెరిగాయి. అయినప్పటికీ, భారత్‌లో రైతుపై ఆ భారం పడకుండా చూస్తామని కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. దేశీయంగా ఎరువుల ధరలను పెంచే ప్రసక్తే లేదని, ప్రస్తుతానికి జూన్ వరకు సరిపడా స్టాక్ అందుబాటులో ఉందని భరోసా ఇచ్చింది. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా సహజ వాయువు సరఫరాను కూడా క్రమబద్ధీకరించింది.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 61.14 లక్షల టన్నుల యూరియా సిద్ధంగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు 6 లక్షల టన్నులు ఎక్కువ. యుద్ధం కారణంగా సరఫరా గొలుసు దెబ్బతిన్నప్పటికీ, ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే 10 లక్షల టన్నుల యూరియాను ఓడరేవులకు చేర్చారు. మన దేశంలో యూరియా ఉత్పత్తి కూడా 23 శాతం పెరిగి, రోజుకు 67 వేల టన్నులకు చేరుకోవడం విశేషం. దీనివల్ల రాబోయే ఖరీఫ్ సీజన్‌కు ఎటువంటి ఆటంకం కలగదని విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణలో వానాకాలం సీజన్ ఇతర రాష్ట్రాల కంటే కాస్త ముందుగానే ప్రారంభమవుతుంది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 10.50 లక్షల టన్నుల యూరియా అవసరమని అంచనా వేసిన ప్రభుత్వం, ఏప్రిల్ నుంచే బఫర్ స్టాక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జూన్ నెలలో డిమాండ్ పెరుగుతుంది కాబట్టి, ఏప్రిల్ నుండి నెలకు 2 లక్షల టన్నుల చొప్పున కేటాయించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. దీనివల్ల క్షేత్రస్థాయిలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా ఎరువులను నిల్వ చేసే అవకాశం ఉంటుంది.
మన దేశం యూరియా తయారీకి అవసరమైన గ్యాస్ కోసం ఎక్కువగా ఖతార్ వంటి పశ్చిమాసియా దేశాలపై ఆధారపడుతుంది. అక్కడ ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో, కేంద్రం ఇప్పుడు రష్యా, అమెరికా, కెనడా వంటి దేశాల నుండి దిగుమతుల కోసం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు, రసాయన ఎరువుల వాడకం వల్ల నేల సారం దెబ్బతింటోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. అందుకే సాధారణ యూరియాకు బదులుగా నానో యూరియా, జీవ ఎరువులను వాడాలని ప్రభుత్వం రైతులను ప్రోత్సహిస్తోంది.
Be the first to react