TDP Mahanadu 2026: మహానాడుకు ముస్తాబవుతున్న ఉత్తరాంధ్ర.. వేదిక ఎంపికపై టీడీపీ హైకమాండ్ ఫోకస్!
TDP Mahanadu 2026: మే 27, 28, 29 తేదీల్లో జరగనున్న టీడీపీ మహానాడు వేదిక కోసం కసరత్తు ప్రారంభమైంది. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని భోగాపురం, రణస్థలం ప్రాంతాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేడు పరిశీలించనున్నారు. ఉత్తరాంధ్ర వేదికగా జరగనున్న ఈ భారీ బహిరంగ సభకు …
TDP Mahanadu 2026: తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మక వార్షిక పండుగ 'మహానాడు' నిర్వహణకు ముహూర్తం ఖరారైంది. ఈ ఏడాది ఉత్తరాంధ్ర వేదికగా ఈ భారీ బహిరంగ సభను నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వేదిక ఎంపికపై టీడీపీ శ్రేణులు కసరత్తును ముమ్మరం చేశాయి.
శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అనువైన స్థలాల కోసం పార్టీ ముఖ్య నేతలు జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా భోగాపురం పరిసర ప్రాంతాల్లోని నాలుగు కీలక ప్రదేశాలను పరిశీలనలోకి తీసుకున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లా రణస్థలం సమీపంలోని ప్రాంతాలను కూడా పార్టీ పరిశీలిస్తోంది. లక్షలాదిగా తరలివచ్చే కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా, రవాణా సౌకర్యాలు మెరుగ్గా ఉన్న చోట వేదికను సిద్ధం చేయాలని భావిస్తున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేడు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. ఆయన ప్రతిపాదిత స్థలాలను స్వయంగా సందర్శించి, అక్కడి వసతులు భద్రతా అంశాలను అంచనా వేస్తారు. జిల్లాల నేతలతో చర్చించిన అనంతరం, మహానాడు నిర్వహణకు అత్యంత అనువైన స్థలంపై ఒక నివేదికను సిద్ధం చేస్తారు.వచ్చే మే నెల 27, 28, 29 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందుతున్నాయి.
పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా ఇదే సమయంలో ఉండటంతో, కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపేలా కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. రాజకీయ తీర్మానాలతో పాటు భవిష్యత్తు కార్యాచరణను ఇక్కడే ప్రకటించే అవకాశం ఉండనుంది. వేదిక ఎంపికపై మరో రెండు మూడు రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. ఉత్తరాంధ్రలో మహానాడు నిర్వహించడం ద్వారా ఆ ప్రాంతంలో పార్టీని మరింత బలోపేతం చేయవచ్చని అగ్రనాయకత్వం యోచిస్తోంది.
Be the first to react