కేంద్రమంత్రి శివరాజ్‍సింగ్‍తో వీడియోకాన్ఫరెన్స్ లో పాల్గొన్న మంత్రి అచ్చెన్న..
శనగల కొనుగోలు లక్ష్యాన్ని పెంచాలని కేంద్రాన్ని కోరిన మంత్రి..
అమరావతి: రాష్ట్రంలో శనగల సాగు, ఉత్పత్తి పెరిగిన నేపథ్యంలో రైతులకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో మంత్రి అచ్చెన్నాయుడు కేంద్రంతో కీలక చర్చలు జరిపారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్‌తో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొని, రాష్ట్ర పరిస్థితిని వివరించారు.
ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఈ సీజన్‌లో మొత్తం 7.13 లక్షల టన్నుల శనగల ఉత్పత్తి జరిగినట్లు తెలిపారు. ఇప్పటివరకు 94,500 టన్నుల శనగలను కొనుగోలు చేసినట్లు వెల్లడించారు. అయితే రైతులకు మరింత ఉపశమనం కల్పించేందుకు కొనుగోలు లక్ష్యాన్ని 1,78,250 టన్నులకు పెంచాలని కేంద్రాన్ని కోరారు.
రాష్ట్ర అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన కేంద్రం, అదనంగా 15 వేల టన్నుల శనగల కొనుగోలుకు వెంటనే అనుమతి ఇచ్చింది. ఇంకా మిగిలిన 68,750 టన్నుల శనగలను కూడా కేంద్రం ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. కొనుగోళ్లు సకాలంలో జరిగేందుకు వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని కూడా కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.
ఇదే సమయంలో రాష్ట్రంలో పంటల మార్పిడి ప్రభావంపై కూడా మంత్రి అచ్చెన్నాయుడు దృష్టి సారించారు. మిర్చి, పొగాకు రైతులు పంటలను మార్చుకోవడంతో మొక్కజొన్న సాగు గణనీయంగా పెరిగిందని చెప్పారు. అధిక దిగుబడి కారణంగా మార్కెట్‌లో మొక్కజొన్న సరఫరా ఎక్కువైందని తెలిపారు. మరోవైపు, ఇథనాల్ తయారీలో బ్రోకెన్ రైస్ వినియోగం పెరగడంతో మొక్కజొన్నకు డిమాండ్ తగ్గినట్లు వివరించారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. రైతులకు సరైన ధరలు, స్థిరమైన మార్కెట్ అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.