- "పీఓకే మనదే.. విభజన మన ఇష్టం": నియోజకవర్గాల పునర్విభజనపై పాక్ అభ్యంతరాలను తోసిపుచ్చిన భారత్..
- Politics: జమ్మూ కశ్మీర్ పునర్విభజనపై మళ్ళీ పాక్ ఏడుపు: గట్టిగా బదులిచ్చిన భారత ప్రతినిధి..
India & Pakistan: భారత ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లు-2026పై పాకిస్థాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. లోక్‌సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లులో పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) పరిధిలోని నియోజకవర్గాల పునర్విభజన చేసే అధికారాన్ని భారత ఎన్నికల సంఘానికి కల్పిస్తూ ఒక కీలక నిబంధనను చేర్చారు. ఈ అంశంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ ప్రతినిధి తాహిర్ ఆంద్రాబీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, భారత్ తీసుకున్న నిర్ణయం అంతర్జాతీయ నిబంధనలకు విరుద్ధమని వ్యాఖ్యానించారు. అయితే, పాక్ విమర్శలను తోసిపుచ్చిన భారత విదేశాంగ శాఖ, తమ దేశ అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చే హక్కు ఏ ఇతర దేశానికి లేదని గట్టిగా హెచ్చరించింది.
న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ మాట్లాడుతూ, భారతదేశ పరిపాలనా మరియు శాసనపరమైన ప్రక్రియలు పూర్తిగా దేశ సార్వభౌమత్వానికి సంబంధించినవని స్పష్టం చేశారు. ఒక స్వతంత్ర దేశంగా తన సరిహద్దుల లోపల నియోజకవర్గాలను పునర్విభజించుకునే హక్కు భారత్‌కు ఉందని, ఇందులో బయటి వ్యక్తుల జోక్యం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన పేర్కొన్నారు. జమ్మూ కశ్మీర్ మరియు లడఖ్ సహా పాక్ ఆక్రమిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని, అక్కడ ఎన్నికల ప్రక్రియలకు సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం కేవలం భారత రాజ్యాంగానికి మాత్రమే ఉంటుందని పునరుద్ఘాటించారు.
పాకిస్థాన్ లేవనెత్తిన అభ్యంతరాలు అర్థరహితమని, తమ సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ప్రకటనలు చేస్తోందని రణధీర్ జైశ్వాల్ విమర్శించారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌ను అభాసుపాలు చేయాలనే పాక్ ప్రయత్నాలు ఎప్పటికీ నెరవేరవని, తమ భూభాగంలో చేపట్టే ఎలాంటి అభివృద్ధి లేదా రాజకీయ ప్రక్రియలనైనా సార్వభౌమత్వ స్ఫూర్తితో కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. పొరుగు దేశాలు తమ పరిధిని దాటి భారత అంతర్గత చట్టాలపై స్పందించడం ద్వైపాక్షిక సంబంధాలకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.