ఐదో తరం యుద్ధ విమానాల తయారీ లక్ష్యంతో..
650 ఎకరాల్లో రూ.15,803 కోట్ల అంచనా వ్యయంతో..
పుట్టపర్తి, మే 14: దేశ రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆంధ్రప్రదేశ్‌లో మరో కీలక అడుగు పడుతోంది. భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు పుట్టపర్తిలో అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం శ్రీ సత్యసాయి జిల్లాలో జరగనుండటం రాష్ట్రానికి ప్రతిష్ఠాత్మకంగా మారింది.
భారతదేశానికి చెందిన ఐదో తరం యుద్ధ విమానాల తయారీ లక్ష్యంతో ఈ AMCA ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. రక్షణ పరిశోధన సంస్థ డీఆర్‌డీఓ ఆధ్వర్యంలోని ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఈ ఫెసిలిటీని నిర్మిస్తోంది. ఇందులో యుద్ధ విమానాల సమీకరణ, అభివృద్ధి, ఫ్లైట్ టెస్టింగ్, ధృవీకరణ వంటి కీలక కార్యకలాపాలు జరగనున్నాయి.
దాదాపు 650 ఎకరాల్లో రూ.15,803 కోట్ల అంచనా వ్యయంతో ఈ భారీ ప్రాజెక్టు ఏర్పడనుంది. భారత్‌కు అవసరమైన అత్యాధునిక స్టెల్త్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ అవియానిక్స్, సమగ్ర యుద్ధ సామర్థ్యాల అభివృద్ధిలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషించనుంది. విదేశీ టెస్టింగ్ వ్యవస్థలపై ఆధారపడకుండా దేశీయంగా అన్ని పరీక్షలు నిర్వహించే సామర్థ్యం కూడా ఈ ప్రాజెక్టుతో పెరగనుంది.
ఈ ప్రాజెక్టు ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల కేటాయింపు, మౌలిక వసతులు, అనుమతుల మంజూరులో పూర్తి సహకారం అందించింది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి నైపుణ్య ఆధారిత ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. అలాగే రాయలసీమలో ఏరోస్పేస్, డిఫెన్స్ తయారీ రంగాలకు పెద్ద ఊతం లభించనుంది.
శ్రీ సత్యసాయి జిల్లా ఇప్పటికే పారిశ్రామిక, ఏరోస్పేస్ పెట్టుబడులకు అనువైన ప్రాంతంగా ఎదుగుతోంది. బెంగళూరులోని ఏరోస్పేస్ కేంద్రాలకు సమీపంగా ఉండటం ఈ ప్రాంతానికి ప్రత్యేక బలం. ఇప్పటికే రక్షణ, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ విడిభాగాలు, లోహ పరిశ్రమల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ వంటి ప్రముఖ సంస్థలు రక్షణ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టాయి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన “ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 2025-30” కింద నౌకాదళ వ్యవస్థలు, క్షిపణులు, డ్రోన్లు, డిఫెన్స్ ఎలక్ట్రానిక్స్, ప్రెసిషన్ మాన్యుఫాక్చరింగ్, రీసెర్చ్ కేంద్రాలకు ప్రత్యేక క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది.
ఇక శ్రీ సత్యసాయి, తిరుపతి జిల్లాల్లో “స్పేస్ సిటీ” అభివృద్ధి పనులు కూడా కొనసాగుతున్నాయి. లేపాక్షి, దొనకొండ, తిరుపతి, విశాఖపట్నం, ఓర్వకల్లు ప్రాంతాలను ఏరోస్పేస్ సిటీలుగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రక్షణ, అంతరిక్ష, డీప్ టెక్నాలజీ రంగాల్లో రాష్ట్రాన్ని ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది.
AMCA ప్రాజెక్టుతో పాటు మరికొన్ని కీలక రక్షణ, డ్రోన్ రంగ ప్రాజెక్టులకు కూడా శంకుస్థాపనలు జరగనున్నాయి. ప్రీమియర్ ఎక్స్‌ప్లోసివ్స్ లిమిటెడ్, ఆగ్నేయస్త్ర ఎనర్జేటిక్స్ లిమిటెడ్, డ్రోగో డ్రోన్స్ ప్రైవేట్ లిమిటెడ్, డ్రోన్ ల్యాబ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, హెచ్ సీ రోబోటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సెన్స్ ఇమేజ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎయిర్ పేస్ ఇండస్ట్రీస్, జేడీకే ఫ్లై డ్రోన్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్, లాట్రిక్స్ ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థల ప్రాజెక్టులకు కూడా భూమిపూజలు జరగనున్నాయి.
అదే సమయంలో మరో తొమ్మిది కంపెనీలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో రక్షణ, ఏరోస్పేస్ రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నాయి. దీంతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే కీలక రక్షణ తయారీ కేంద్రంగా ఎదుగుతోందన్న అభిప్రాయం పరిశ్రమ వర్గాల్లో వ్యక్తమవుతోంది.