తన కాన్వాయ్‌లోని వాహనాలు 50 శాతం తగ్గించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం..
4 వాహనాలతోనే ఏపీ సచివాలయానికి వచ్చిన సీఎం కాన్వాయ్..
అమరావతి: ఇంధన పొదుపు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ దిశగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కాన్వాయ్‌లో ఉపయోగించే వాహనాల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించాలని నిర్ణయించారు. ప్రభుత్వ వ్యవస్థలో పొదుపు చర్యలు ముందుగా ప్రజాప్రతినిధుల నుంచే ప్రారంభం కావాలనే సందేశాన్ని సీఎం ఈ నిర్ణయంతో ఇచ్చారు.
ఇటీవల దేశవ్యాప్తంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో సీఎం చంద్రబాబు కూడా అదే దిశగా చర్యలు ప్రారంభించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను గణనీయంగా తగ్గించారు.
ఈ నిర్ణయం అమల్లో భాగంగా ముఖ్యమంత్రి కేవలం నాలుగు వాహనాలతోనే ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి చేరుకున్నారు. సాధారణంగా పెద్ద ఎత్తున వాహనాలతో వెళ్లే కాన్వాయ్ స్థానంలో తక్కువ వాహనాలతో ప్రయాణించడం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది.
భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఒక బస్సును ఏర్పాటు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. దీనివల్ల అనేక చిన్న వాహనాల వినియోగం తగ్గి ఇంధన పొదుపుతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు.
అంతేకాకుండా జిల్లాల పర్యటనల సమయంలో కూడా అవసరానికి మించిన వాహనాలు వినియోగించవద్దని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు డీజీపీ, ఇంటెలిజెన్స్ చీఫ్‌లకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా తక్కువ వాహనాలతోనే పర్యటనలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజా ధనం ఆదా చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని సీఎం భావిస్తున్నారని అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వంలో ఉన్నవారే ముందుగా ఆదర్శంగా నిలిస్తే ప్రజల్లో కూడా పొదుపు భావన పెరుగుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.