కురుబల ఉన్నతి టీడీపీతోనే..
కురుబ సామాజిక వర్గ అభ్యున్నతి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమైందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత అన్నారు. కురుబలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు కల్పించిన నాయకులు అన్న ఎన్టీఆర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడేనని ఆమె పేర్కొన్నారు.
బాపులపాడు మండలం కాకులపాడు గ్రామంలో నిర్వహించిన శ్రీ కామ్రవతీ సమేత బీరయ్య స్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో మంత్రి సవిత ప్రభుత్వ విప్, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆమె మాట్లాడారు.
విద్య ద్వారానే కురుబ సామాజిక వర్గానికి చెందిన యువత ఉన్నత స్థాయికి చేరుకోగలరని మంత్రి సవిత అన్నారు. ప్రతి కుటుంబం తమ పిల్లలను ఉన్నత విద్య చదివించేందుకు ప్రోత్సహించాలని సూచించారు. బీసీల అభివృద్ధికి అన్న ఎన్టీఆర్ ప్రత్యేక కృషి చేశారని, టీడీపీ ఆవిర్భావం తర్వాతే వెనుకబడిన వర్గాలకు రాజకీయ అవకాశాలు పెరిగాయని గుర్తుచేశారు.
తన తండ్రి, మాజీ మంత్రి రామచంద్రారెడ్డికి అన్న ఎన్టీఆర్ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడమే కాకుండా మంత్రిగా కూడా అవకాశం కల్పించారని చెప్పారు. అనంతరం చంద్రబాబు నాయుడు కేబినెట్‌లో కూడా పలు శాఖలకు మంత్రిగా పనిచేసే అవకాశం దక్కిందని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అండదండల వల్లే తమ కుటుంబానికి, కురుబ సమాజానికి గౌరవం లభించిందన్నారు.
టీడీపీలో నిబద్ధతతో పనిచేసే ప్రతి కార్యకర్తకు పార్టీ తగిన గుర్తింపు ఇస్తుందని మంత్రి సవిత పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తోందని చెప్పారు.
భక్త కనకదాస జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించేందుకు శాశ్వత జీవో జారీ చేసిన విషయాన్ని ఆమె గుర్తుచేశారు. తిరుపతిలో కనకదాస కాంస్య విగ్రహం ఏర్పాటు కోసం మంత్రి నారా లోకేశ్ సహకారంతో స్థలం కేటాయించబడిందని తెలిపారు. అలాగే త్వరలోనే గుడికట్ల పూజారులకు గౌరవ వేతనాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
కాకులపాడు బీరయ్య దేవస్థానం నిర్మాణంలో భాగస్వాములైన నిర్వాహకులను మంత్రి అభినందించారు. గన్నవరం నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న కురుబ విద్యార్థులకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
కార్యక్రమానికి విచ్చేసిన మంత్రి సవిత, ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావుకు గ్రామస్తులు, కూటమి నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారీ ర్యాలీ నిర్వహించి గజమాలతో సత్కరించారు. అనంతరం బీరయ్య స్వామి దేవస్థానంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కురుబ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్పతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, కురుబ సామాజిక వర్గానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.