ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నరసాపురం–చెన్నై సెంట్రల్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలు సేవలు డిసెంబర్ 15(ఈరోజు ) నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ రైలు ప్రారంభంతో పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలకు చెన్నైతో వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణ సౌలభ్యం అందుబాటులోకి రానుంది.
వాస్తవానికి ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను 2026 జనవరి 12న ప్రారంభించాలని రైల్వే బోర్డు తొలుత ప్రకటించింది. అయితే స్థానిక ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రత్యేకంగా చొరవ తీసుకోవడంతో, ప్రయాణికులకు ఒక నెల ముందుగానే ఈ రైలు సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. ఇప్పటికే నరసాపురం రైల్వే స్టేషన్‌లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉదయం 5:30 గంటలకు చెన్నై సెంట్రల్ నుంచి బయలుదేరి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా విజయవాడకు 11:45 గంటలకు చేరుకుంటుంది. అనంతరం గుడివాడ, భీమవరం మీదుగా మధ్యాహ్నం 2:10 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. ఈ రైలు ప్రయాణ సమయం గణనీయంగా తగ్గడంతో ప్రయాణికులకు పెద్ద ప్రయోజనం కలగనుంది.
రిటర్న్ ప్రయాణంలో 20678 నంబరుతో మధ్యాహ్నం 2:50 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరి, అదే మార్గంలో ప్రయాణిస్తూ రాత్రి 11:45 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. వేగం, సౌకర్యం, ఆధునిక సదుపాయాలతో ఈ వందేభారత్ రైలు ప్రయాణికులకు కొత్త అనుభూతిని అందించనుంది.
ఇదిలా ఉండగా, విజయవాడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభంపై కూడా ప్రయాణికుల్లో ఆశలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మార్గంలో కొండవీటి ఎక్స్‌ప్రెస్ మాత్రమే వారంలో కొన్ని రోజులు నడుస్తుండటంతో, రోజూ నడిచే వందేభారత్ రైలును ప్రారంభించాలని ప్రయాణికులు కోరుతున్నారు. దీనిపై రైల్వే శాఖ నుంచి ఇంకా అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.