- నిర్వాసితులకు రూ. 1,943 కోట్ల పరిహారం: కూటమి ప్రభుత్వం వచ్చిన 21 నెలల్లోనే భారీ పంపిణీ..
- "డయాఫ్రం వాల్ దాదాపు పూర్తి": జూన్ నాటికి కుడి, ఎడమ కాలువల అనుసంధానమే లక్ష్యం..
Minister Nimmala: ఏలూరు జిల్లాలోని ప్రతిష్టాత్మక పోలవరం సాగునీటి ప్రాజెక్టు పనులను రాష్ట్ర గవర్నర్‌తో కలిసి జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కేంద్ర జల సంఘం (CWC) ఆమోదించిన డిజైన్లు మరియు పోలవరం ప్రాజెక్టు అథారిటీ (PPA) నిబంధనల ప్రకారం, అంతర్జాతీయ నిపుణుల అమూల్యమైన సూచనలతో పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణ పురోగతిని ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తున్నామని, ప్రస్తుతం కొత్తగా చేపట్టిన డయాఫ్రం వాల్ నిర్మాణం దాదాపు పూర్తి కావచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి కుడి మరియు ఎడమ కాలువల అనుసంధాన పనులను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని, తద్వారా ఈ సీజన్ ప్రారంభంలోనే ఎడమ ప్రధాన కాలువ ద్వారా అనకాపల్లి వరకు గోదావరి జలాలను తీసుకెళ్లేలా పనులు శరవేగంగా సాగుతున్నాయని స్పష్టం చేశారు.
ప్రాజెక్టు నిర్మాణంతో పాటు నిర్వాసితుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి నిమ్మల వివరించారు. 2016లో నాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే చంద్రబాబు నాయుడు నిర్వాసితులకు రూ. 700 కోట్ల పరిహారం అందించారని గుర్తు చేసిన ఆయన, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 21 నెలల్లోనే మూడు విడతలుగా రూ. 1,943 కోట్ల భారీ పరిహారాన్ని పంపిణీ చేసినట్లు తెలిపారు. నిర్వాసితుల ఇంటి నిర్మాణానికి రూ. 3.5 లక్షలు, ఇంటి స్థలం కోసం రూ. 2 లక్షల చొప్పున ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తోందని, వారి సమస్యల తక్షణ పరిష్కారం కోసం ప్రత్యేకంగా 'గ్రీవెన్స్ సెల్' ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును సంపూర్ణంగా పూర్తి చేసి జాతికి అంకితం చేయాలనే కృతనిశ్చయంతో ప్రభుత్వం పనిచేస్తోందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.