పేదల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సహకారంతో ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ 2.0 (PMAY-G 2.0) పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం కింద అర్హులైన గ్రామీణ పేదలకు ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించనున్నారు. వచ్చే నెల నుంచి ఇళ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఈ పథకానికి గతేడాది డిసెంబర్ 14 వరకు దరఖాస్తులు స్వీకరించగా, 60 వేల మందికి పైగా అప్లై చేశారు. దరఖాస్తు చేసుకున్న వారిలో నిజమైన అర్హులను గుర్తించేందుకు అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయిలో సర్వేలు (Field Level Survey) నిర్వహిస్తున్నారు. ఈ పరిశీలనల ఆధారంగా తుది లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.2.50 లక్షల ఆర్థిక సహాయం అందిస్తాయి. సొంత స్థలం ఉన్నవారు ఈ మొత్తంతో ఇల్లు నిర్మించుకోవచ్చు. స్థలం లేని వారికి ప్రభుత్వం ఇంటి స్థలాన్ని కేటాయించి, నిర్మాణానికి అవసరమైన సహాయం అందిస్తుంది.
పథకానికి పరిపాలనా ఆమోదం వచ్చిన తర్వాత నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. ఇళ్ల నిర్మాణం దశలవారీగా పూర్తయ్యే కొద్దీ బిల్లులు చెల్లిస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అవకాశం కల్పించేందుకు అధికారులు జాబితాలను సిద్ధం చేసి ప్రభుత్వానికి నివేదించారు.
ఇల్లు కట్టుకోవాలనుకునే వారు గ్రామ సచివాలయంలోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లను సంప్రదించి దరఖాస్తు చేసుకోవచ్చు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, జాబ్ కార్డు, ఫోటోలు వంటి పత్రాలు అవసరం. త్వరలోనే అర్హుల జాబితాలు విడుదల చేసి, వచ్చే నెలలో పూర్తి స్పష్టత ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు.