ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జూపార్క్ (Zoo Park) ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో జూపార్క్‌ను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. రాజానగరం అభయారణ్యంలో జూపార్క్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై కేంద్ర బృందం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టడం విశేషంగా మారింది.
ఢిల్లీ నుంచి వచ్చిన కేంద్ర బృందం బుధవారం రోజున రాజానగరం మండల పరిధిలోని దివాన్ చెరువు వద్ద ఉన్న అటవీ భూమిని పరిశీలించింది. ఈ పరిశీలనలో భాగంగా ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. జూపార్క్ ఏర్పాటుకు అనువైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయా అనే అంశంపై బృందం అధ్యయనం చేసింది.
సుమారు 250 హెక్టార్ల విస్తీర్ణంలో జూపార్క్ ఏర్పాటు చేసేందుకు ప్రాథమిక ప్రణాళికలు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. అటవీ విస్తీర్ణం, పర్యావరణ సమతుల్యత, వన్యప్రాణుల సంరక్షణ (Wildlife Conservation) వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని కేంద్ర బృందం పరిశీలన జరిపింది. కేంద్రం నుంచి సానుకూల స్పందన వస్తే త్వరలోనే కార్యాచరణ ప్రారంభించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
దివాన్ చెరువు పండ్ల మార్కెట్ నుంచి గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ మధ్యలో ఉన్న సుమారు 700 ఎకరాల అటవీ భూమిలో జూపార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇప్పటికే కొంత మేర తుప్పలు, అడవి మొక్కలను తొలగించి భూమిని శుభ్రం చేసినట్లు సమాచారం. ఇది ప్రాజెక్ట్ వేగవంతానికి సూచికగా భావిస్తున్నారు.
మరోవైపు రాజమండ్రి నగరంలో నగరవనం అభివృద్ధికి కూడా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఫుడ్ కోర్టు, జిప్‌లైన్ వంటి సదుపాయాలతో పర్యాటకులను ఆకర్షించాలని భావిస్తోంది. నగరవనం, జూపార్క్ రెండూ అమలులోకి వస్తే రాజమహేంద్రవరం పర్యాటకంగా మరింత అభివృద్ధి చెందుతూ పర్యాటక రంగం (Eco Tourism) కు పెద్ద ఊతం లభిస్తుందని పర్యావరణ ప్రేమికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర బృందం నివేదిక ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకోనున్నారు.