అమరావతి భవిష్యత్తుకు మరొక కీలక ఘట్టాన్ని సూచించేలా రాజధాని ప్రాంతంలో 15 జాతీయ బ్యాంకులు మరియు బీమా సంస్థల ప్రధాన కార్యాలయాల శంకుస్థాపన కార్యక్రమం గురువారం అమరావతిలో జరిగింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం పూర్తి కావడంతో అమరావతిని నిజమైన పరిపాలనా, ఆర్థిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోందన్నది స్పష్టం అయింది. ఉద్దండరాయునిపాలెంలో జరిగిన ఈ భారీ బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ భావోద్వేగంగా మాట్లాడుతుండగా, అమరావతి ఉద్యమం ఎదుర్కొన్న కష్టాలను మరోసారి గుర్తుచేశారు.
లోకేష్ మాట్లాడుతూ అమరావతి రైతుల త్యాగం, ప్రజల ఆశలు, కేంద్రం ఇచ్చిన మాటలన్నీ కలిసి రాజధానికి కొత్త ఊపిరి పోస్తున్నాయని పేర్కొన్నారు. అమరావతిని “దేవతల రాజధాని”గా అభివర్ణిస్తూ, గత ఐదేళ్లలో దానిని అడ్డుకునేందుకు కొన్ని శక్తులు ఎంత ప్రయత్నించినా అమరావతి ప్రజల ఆత్మవిశ్వాసం, ఉద్యమ స్పూర్తి వాటిని నిలువరించిందని అన్నారు. మూడు రాజధానుల పేరుతో ప్రజలను గందరగోళానికి గురిచేసిన మాజీ ప్రభుత్వాన్ని ఎత్తిచూపుతూ రాజధాని పనులను పూర్తిగా నిలిపివేసి కూడా నాటి ముఖ్యమంత్రి మాత్రం వందల కోట్లతో నిర్మించిన విలాసవంతమైన నివాసంలో కూర్చున్నారంటూ విమర్శలు గుప్పించారు.
1631 రోజులపాటు అమరావతి ఉద్యమం కొనసాగిందని, చిన్నారి నుండి వృద్ధుడి వరకు అందరూ “జై అమరావతి” అంటూ రోడ్లపై నిలబడడం ఒక యుగానికి నిదర్శనమని లోకేష్ స్పష్టం చేశారు. రైతులపై పెట్టిన కేసులు, మహిళలపై జరిగిన దాడులు, 270 మంది రైతులు గుండె ఆగిపోయి చనిపోవడం వంటి విషాద సంఘటనలు రాష్ట్ర చరిత్రలో శాశ్వత చెరగని ముద్రలు అని చెప్పారు. అయితే ఈ త్యాగం వృథా కాలేదని రాజధాని నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన మద్దతు ఇప్పుడు అమరావతిని మళ్లీ సరైన దారిలో నడిపిస్తోందని తెలిపారు.
ఈ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు లోకేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆమెను “స్త్రీ శక్తి”కు ప్రతీకగా కొనియాడుతూ పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను కఠినమైన వాదనలతో ఎదుర్కోవడం, దేశ ఆర్థిక వ్యవస్థకు ఆమె ఇచ్చిన దిశ, వరుసగా ఎనిమిది బడ్జెట్లను ప్రవేశపెట్టిన అరుదైన ఘనత వంటి అంశాలను వివరించారు. అంతర్జాతీయ స్థాయిలో అత్యంత శక్తివంతమైన మహిళల జాబితాలో ఆరు సార్లు స్థానం సంపాదించడం, చేనేత చీరల ప్రోత్సాహానికి ప్రత్యేకంగా కృషి చేయడం వంటి విషయాలను గుర్తుచేశారు. రాష్ట్రం కోసం ఎప్పుడైనా ప్రధాని లేదా కేంద్ర మంత్రులను కలిసినప్పుడు, అమరావతి అవసరాల మీద ఆమె వెంటనే స్పందించారని లోకేష్ తెలిపారు.
పోలవరంతో మొదలుకుని అమరావతి వరకూ నిలిచిపోయిన కీలక ప్రాజెక్టులను క్రమబద్ధీకరించడంలో కూడా ఆమె ప్రధాన పాత్ర పోషించిందని వివరించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యపై అర్ధరాత్రి కూడా సమీక్ష నిర్వహించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవడం, గూగుల్ విశాఖలో డేటా సెంటర్ స్థాపనకు అవసరమైన హామీలు ఇవ్వడం కీలకమని తెలిపారు.
అమరావతిలో నిర్మించబోయే బ్యాంక్ స్ట్రీట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయనుంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వరకు 15 ప్రధాన బ్యాంకులు, బీమా సంస్థలు కలిసి రూ.1,334 కోట్లతో ఏర్పాటుచేయబోయే ఈ కార్యాలయాల ద్వారా 7 వేలకుపైగా ఉద్యోగాలు సృష్టించబడతాయి. అమరావతి భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని, అన్ని బ్యాంకింగ్ సేవలను ఒకే ప్రాంతంలో అందుబాటులోకి తీసుకురావడం రాజధానికి ప్రత్యేక గుర్తింపు తీసుకురానుంది.
రైతులందరూ ఈ సమయంలో ఓర్పుతో ప్రభుత్వం చేపడుతున్న చర్యలకు అండగా నిలవాలని లోకేష్ పిలుపునిచ్చారు. “గత అయిదేళ్ల నష్టాన్ని మళ్లీ దగ్గర చేయడానికి సమయం పడుతుంది. కానీ ఇప్పుడు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే శ్రావణ్, నేను అందరం రైతులతో కలిసి అమరావతి కోసం పనిచేస్తాం అని హామీ ఇచ్చారు.