దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన ఖాతాదారులకు ఊరటనిచ్చే కీలక నిర్ణయం తీసుకుంది. పలు రుణాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించడంతో పాటు, కొన్ని ఎంపిక చేసిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను కూడా సవరించినట్లు ప్రకటించింది. ఈ కొత్త వడ్డీ రేట్లు ఈ నెల 15వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ నిర్ణయం వల్ల గృహ రుణాలు, వాహన రుణాలు, ఎంఎస్‌ఎంఈ రుణాలు తీసుకున్న వారికి ఈఎంఐ భారం కొంత మేర తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఇది రుణగ్రహీతలకు మంచి ఊరటనిచ్చే అంశంగా భావిస్తున్నారు.
ఎస్బీఐ అన్ని కాలపరిమితులపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు (MCLR)ను 5 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. దీనితో ఒక సంవత్సరం కాలపరిమితి గల MCLR 8.75 శాతం నుంచి 8.70 శాతానికి తగ్గింది. ఇదే విధంగా ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు (EBLR)ను కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ 7.90 శాతంగా నిర్ణయించింది. అంతేకాకుండా పాత రుణగ్రహీతలకు వర్తించే బేస్ రేటును 10.00 శాతం నుంచి 9.90 శాతానికి తగ్గించింది. ఈ మార్పులతో ఫ్లోటింగ్ రేట్లపై తీసుకున్న రుణాలకు నెలవారీ వాయిదాలు తగ్గే అవకాశం ఉందని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు.
ఇక మరోవైపు రిటైల్ టర్మ్ డిపాజిట్లపై కూడా ఎస్బీఐ వడ్డీ రేట్లను స్వల్పంగా తగ్గించింది. రూ.3 కోట్ల లోపు ఉన్న డిపాజిట్లకు ఈ మార్పులు వర్తిస్తాయి. 2 నుంచి 3 సంవత్సరాల కాలపరిమితి గల డిపాజిట్లపై వడ్డీ రేటును 6.45 శాతం నుంచి 6.40 శాతానికి తగ్గించారు. సీనియర్ సిటిజన్లకు ఇదే కాలపరిమితిలో వడ్డీ రేటు 6.95 శాతం నుంచి 6.90 శాతానికి తగ్గింది. అలాగే ఎంతో ప్రజాదరణ పొందిన ‘అమృత్ వృష్టి’ 444 రోజుల టర్మ్ డిపాజిట్ పథకంపై వడ్డీని 6.60 శాతం నుంచి 6.45 శాతానికి తగ్గించినట్లు ఎస్బీఐ ప్రకటించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితి గత కొన్నేళ్లుగా మెరుగుపడుతున్న నేపథ్యంలోనే ఈ తరహా వడ్డీ రేట్ల సవరణలు చోటు చేసుకుంటున్నాయి. 2022–23 ఆర్థిక సంవత్సరం నుంచి ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి మూలధన సహాయం అందించలేదని ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. లాభాల్లో కొనసాగుతున్న బ్యాంకులు తమ వడ్డీ విధానాల్లో సర్దుబాట్లు చేస్తూ రుణగ్రహీతలకు కొంత ఊరట కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ నిర్ణయం రుణ మార్కెట్‌లో డిమాండ్‌ను పెంచే అవకాశం ఉందని ఆర్థిక వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.