తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. డిసెంబర్ మధ్యలోకి అడుగుపెడుతున్న వేళ, సాధారణంగా ఉండాల్సిన ఉష్ణోగ్రతల కంటే కనీసం 6 నుంచి 7 డిగ్రీల వరకు తక్కువగా నమోదవడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తుంది. తెల్లవారుజామున, రాత్రివేళల్లో ఉష్ణోగ్రతలు ఒక్క అంకెలకు పడిపోవడంతో పట్టణాలు, గ్రామాలు అన్న తేడా లేకుండా చలి ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ఉదయం బయటకు వెళ్లాలంటేనే వణుకు పుట్టే పరిస్థితి నెలకొంది.
ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతారామ రాజు జిల్లా ఈ సీజన్‌లో అత్యంత చలిని ఎదుర్కొంటోంది. పాడేరు, అరకు, మినుములూరు, చింతపల్లి వంటి లోయ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనీవినీ ఎరుగని స్థాయిలో పడిపోయాయి. మినుములూరులో 4 డిగ్రీల సెల్సియస్, అరకులో సుమారు 4.6 డిగ్రీలు, పాడేరులో 6 డిగ్రీలు, చింతపల్లిలో 6.5 డిగ్రీల వరకు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ ప్రాంతాల్లో ఉదయాన్నే దట్టమైన పొగ కమ్ముకోవడంతో రోడ్లు కనిపించని పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటి నుండి బయటకు అడుగు పెట్టడానికే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణాల్లోనూ చలి ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయం పనుల కోసం బయల్దేరే ఉద్యోగులు, రైతులు దుస్తులపై దుస్తులు వేసుకుని బయటకు రావాల్సి వస్తుంది. సాయంత్రం అయ్యిందంటే చాలామంది ఇళ్లలోనే ఉండేందుకు ఇష్టపడుతున్నారు. ప్రధాన రహదారులపై పొగమంచు కారణంగా వాహనదారులు నెమ్మదిగా ప్రయాణించాల్సి వస్తోంది. ప్రమాదాల అవకాశాలు పెరగకుండా జాగ్రత్తగా డ్రైవ్ చేయాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.
వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ చలి ఇక్కడితో ఆగే సూచనలు లేవు. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాల్లో రానున్న రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు మరో 3 నుంచి 4 డిగ్రీల వరకు పడిపోయే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతాల్లో చలి తీవ్రత మరింతగా ఉండవచ్చని హెచ్చరికలు జారీ చేసింది. ఇప్పటికే రాత్రివేళల్లో చలి ఎక్కువగా అనిపిస్తున్న ప్రాంతాల్లో పరిస్థితి మరింత కఠినంగా మారే సూచనలు ఉన్నాయి.
వాతావరణ నిపుణులు ఈ అకస్మాత్తు ఉష్ణోగ్రతల పతనానికి ఉత్తర దిశ నుంచి వీస్తున్న చల్లని గాలులే ప్రధాన కారణమని చెబుతున్నారు. హిమాలయ ప్రాంతాల్లో ఏర్పడిన మంచు తుఫాన్లు, వాయు పీడన మార్పులు దక్షిణ భారతదేశం వైపు చల్లని గాలులను వస్తున్నాయని అదే సమయంలో ఆకాశం స్పష్టంగా ఉండటం, మేఘావరణం లేకపోవడం వల్ల రాత్రివేళ భూమి నుంచి వేడి త్వరగా బయటకు వెళ్లిపోతోంది. దీని ఫలితంగా చలి మరింత పెరుగుతోంది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భారత వాతావరణ శాఖ సూచించింది. రాత్రి, తెల్లవారుజామున బయటకు వెళ్లేవారు గాలిని తట్టుకునే దుస్తులు ధరించాలని, వృద్ధులు మరియు చిన్నపిల్లలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు ఇస్తున్నారు.రానున్న రోజుల్లోనూ చలి తీవ్రత కొనసాగనున్నందున తెలుగు రాష్ట్రాల ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.