పుణేకు చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు అంజు మనే చూపిన నిజాయతీ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది. రోజూ లాగే గడచిన గురువారం ఉదయం కూడా ఆమె తన విధుల్లో భాగంగా వీధుల్లో చెత్త ఏరి శుభ్రపరిచే పనిలో ఉన్నారు. ఆ సమయంలో ఒక మూలలో పడివున్న బ్యాగ్ ఆమె దృష్టికి వచ్చింది. సాధారణంగా చెత్తగా భావించి పక్కన పెట్టేయవచ్చు కానీ ఆమె దాన్ని తెరిచి చూడగా అందులో మందుల ప్యాకెట్లతో పాటు భారీ మొత్తంలో నగదు ఉన్నట్టు గమనించింది. మొదట డబ్బు చూసి ఆశ్చర్యపోయినా.. ఆ వెంటనే ఇది తప్పిపోయినవారి జీవితానికి ఎంత విలువైనదో అర్థం చేసుకుని వెంటనే దానిని ఒరిజినల్ యజమానికి అందించాలని నిర్ణయించుకుంది.
బ్యాగ్‌ను ఎవరు కోల్పోయారో తెలుసుకునేందుకు అంజు ఆ ప్రాంతం మొత్తం తిరుగుతూ, రోడ్లపై కనిపించే వారిని గమనించారు. ఆ సమయంలోనే చాలా టెన్షన్‌తో కంగారు పడుతూ వెతుకుతున్న వ్యక్తి ఆమెకు కనిపించాడు. ఏదో కోల్పోయినట్టు అతని హావభావాలు చెప్పేశాయి. అంజు దగ్గరకు వెళ్లి నీళ్లు ఇచ్చి ఆయనను ప్రశాంతపరిచే ప్రయత్నం చేసింది. ఆ తర్వాత బ్యాగ్ గురించి ప్రస్తావించగా అతని కళ్లల్లో ఆశ వెలిగింది. అంజు చేతిలో బ్యాగ్ కనిపించగానే కళ్లల్లో కన్నీళ్లు తెరపెట్టుకున్నాడు. అది తనదేనని చెబుతూ ఆమెకు కృతజ్ఞతలు తెలిపాడు.
తరువాత అతడు బ్యాగ్ తెరిచి చెక్ చేయగా అందులో ఉన్న నగదు మొత్తం ₹10 లక్షలని తెలిసింది. అంజు బ్యాగ్‌లో ఉన్న ఒక్క రూపాయినీ తాకకుండా ఇచ్చేసింది. అంజు నిజాయతీకి మెచ్చిన ఆ వ్యక్తి ఆమెకు కృతజ్ఞతగా చీర మరియు కొంత డబ్బు బహూకరించాడు. కానీ అంజు మాత్రం ఈ ప్రపంచంలో మనిషి విలువ మన నిజాయతీ ద్వారానే నిర్ణయిస్తారని చెప్పి తన సాదాసీదా జీవన విధానాన్ని కొనసాగించింది.
ఈ ఘటన బయటపడిన వెంటనే అంజుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. చాలా మంది ఆమెను "నిజమైన హీరో", "మన సమాజానికి ఆదర్శం", "మానవత్వానికి ప్రత్యక్ష ఉదాహరణ"గా అభివర్ణిస్తున్నారు. సోషల్ మీడియాలో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. సాధారణంగా చాలామంది ఇలాంటి డబ్బు దొరికితే తమదిగా చేసుకునే పరిస్థితుల్లో, అంజు చేసిన పని మానవత్వం ఇంకా జీవించి ఉందని నిరూపించింది. ఆమె చూపిన నిజాయితీ, నిస్వార్థం మనిషి ఆర్థిక స్థితి కాదు.. మనసు గొప్పదై ఉండడమే ముఖ్యమని ప్రపంచానికి చెబుతోంది.