తల్లికి వందనం పథకం కింద పాఠశాల విద్యార్థుల తల్లులకు అందించాల్సిన మొత్తంలో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి ₹15,000 చొప్పున ఇచ్చేలా పథకం రూపొందించినప్పటికీ, పలు ప్రాంతాల్లో తల్లుల ఖాతాల్లో కేవలం ₹8,850 మాత్రమే జమ అవుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు గ్రామానికి చెందిన కొండేటి మరియమ్మ కుమారుడు ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. ఆమెకు తల్లికి వందనం కింద ₹8,850 మాత్రమే వచ్చాయని తెలిపారు. దీనిపై వివరాలు తెలుసుకునే క్రమంలో రాష్ట్ర వాటా మాత్రమే జమ అయ్యిందని, కేంద్రం వాటా త్వరలో వస్తుందని మెసేజ్ రావడంతో మరియమ్మ ఆవేదన వ్యక్తం చేసింది.
ఈ నేపథ్యంలో ఓ పత్రిక 'ఇంటింటా నిజం – తల్లికి మోసం' అనే శీర్షికతో కథనం ప్రచురించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. ఫ్యాక్ట్ చెక్ టీమ్ ప్రకారం – రాష్ట్రవ్యాప్తంగా 9,10 తరగతులు, ఇంటర్ 1వ, 2వ సంవత్సరం చదువుతున్న 3.93 లక్షల మంది ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం అమలు అవుతోంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద రూ.382.66 కోట్లను ఇప్పటికే ఖాతాల్లో జమ చేశామని, ప్రతి తల్లికి రూ.5,200 నుంచి రూ.10,972 వరకు నిధులు అందాయని స్పష్టం చేసింది.
కేంద్రం నుంచి వచ్చే మిగతా భాగాన్ని వచ్చే 20 రోజుల్లో విద్యార్థుల లేదా తల్లుల ఆధార్-లింక్డ్ ఖాతాల్లోకి నేరుగా జమ చేస్తారని తెలిపింది. తద్వారా మొత్తం రూ.15,000 పూర్తిగా లబ్ధిదారులకు చేరుతుందని స్పష్టతనిచ్చింది. ప్రస్తుతం తక్కువ మొత్తం వచ్చినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.