వాషింగ్టన్ డీసీలో జరిగిన కృత్రిమ మేధ (AI) సదస్సులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను కాకుండా అమెరికన్లను నియమించుకోవాలని ఆయన బలమైన సందేశం పంపారు.
టెక్ కంపెనీలు గ్లోబలిస్ట్ మైండ్‌సెట్‌తో దేశవాళి టాలెంట్‌ను నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శించారు. స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ, భారతీయుల్ని నియమించుకోవడం, చైనాలో కంపెనీలు నిర్మించడం, ఐర్లాండ్ ద్వారా తక్కువ లాభాలు చూపించడం వంటి వ్యవహారాలను ట్రంప్ తప్పుపట్టారు. “ఈ విధానాలకు నా పాలనలో ముగింపు తప్పదంటూ” ఆయన స్పష్టం చేశారు.
ట్రంప్ వ్యాఖ్యల ప్రస్తావనలో సిలికాన్ వ్యాలీలో దేశభక్తిని ప్రోత్సహించే కొత్త సంస్కృతి అవసరమని, అమెరికాలోని టెక్ కంపెనీలు పూర్తిగా అమెరికా ప్రయోజనాల కోసమే పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ట్రంప్ మూడు కీలక ఆదేశాలపై సంతకం చేశారు. అవి – ఏఐ అభివృద్ధికి ఎదురవుతున్న ఆటంకాలను తొలగించడం, అభివృద్ధిని వేగవంతం చేయడం, అలాగే ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేస్తున్న ఏఐ టూల్స్ రాజకీయ తటస్థతను పాటించేలా చూడటం. AI రంగాన్ని అమెరికా ఆధిపత్యంగా మార్చేందుకు ఇది భాగంగా పేర్కొన్నారు.