రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి కొత్త దిశ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుంటూరు నగరాన్ని “గ్రేటర్ గుంటూరు”గా విస్తరించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాజమండ్రి, కాకినాడ, తిరుపతి, విశాఖపట్నం వంటి నగరాలు అభివృద్ధి దిశగా ముందుకెళ్తున్న నేపథ్యంలో, గుంటూరును కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఆయన వివరించారు.
గుంటూరును మరింత పెద్ద నగరంగా, ఆధునిక వసతులతో అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బుర్లా రామాంజనేయులు తెలిపారు. ఈ నిర్ణయానికి గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ అధికారికంగా ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం అమలులో భాగంగా గుంటూరు నగర పరిధిలోకి మొత్తం 18 గ్రామాలను విలీనం చేయనున్నారు. దీనివల్ల ప్రస్తుతం ఉన్న గుంటూరు నగరం విస్తరించి మహానగరపాలక సంస్థగా మారనుంది. గుంటూరు మండలానికి చెందిన లాల్పురం, చల్లావారిపాలెం, వెంగళాయపాలెం, మల్లవరం, చిన్నపలకలూరు, తోకవారిపాలెం, తురకపాలెం, గొర్లవారిపాలెం, ఓబుల్ నాయుడుపాలెం, జొన్నలగడ్డ గ్రామాలు ఈ విలీనంలో భాగమవుతున్నాయి. అలాగే పెదకాకాని మండలంలోని అగతవరప్పాడు, వెనిగండ్ల, పెదకాకాని, తక్కెళ్లపాడు, చంద్రపాలెం గ్రామాలు కూడా నగర పరిధిలోకి రానున్నాయి.
అదనంగా వట్టి చెరుకూరు మండలంలోని కొర్నెపాడు, పుల్లడిగుంట గ్రామాలు, తాడికొండ మండలంలోని లాం గ్రామాన్ని కూడా నగరంలో కలపాలని నిర్ణయించారు. ఈ మార్పులతో గుంటూరు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతుంది. గ్రామాలు నగరంలో విలీనం కావడం వల్ల పట్టణ మౌలిక వసతుల అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడతాయని అధికారులు భావిస్తున్నారు. రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పారిశుధ్య సేవలు వంటి అంశాలను మెరుగుపర్చే అవకాశం కలుగుతుంది.
భవిష్యత్తులో పరిశ్రమలు, విద్యా సంస్థలు, వైద్య సదుపాయాలు పెరగడానికి ఈ విస్తరణ దోహదపడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. మొత్తంగా గుంటూరును ఒక ప్రణాళికాబద్ధమైన ఆధునిక నగరంగా తీర్చిదిద్దాలన్నదే ఈ నిర్ణయం వెనుక ఉన్న ఉద్దేశం. అదే కౌన్సిల్ సమావేశంలో శంకర్ విలాస్ ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణం అంశంపై రాజకీయ వాతావరణం వేడెక్కింది. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అవసరమైన అనుమతులు లేకుండానే పనులు ప్రారంభించారని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించగా, ఆ ఆరోపణలు నిజం కావని టీడీపీ కార్పొరేటర్ వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ఖండించారు.
ఆర్వోబీ నిర్మాణానికి సంబంధించిన భూసేకరణ ఇప్పటికే 80 శాతం పూర్తయిందని, మిగిలిన అంశాలపై కోర్టును ఆశ్రయించిన బాధితులతో చర్చలు జరుపుతూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని కమిషనర్ పులి శ్రీనివాసులు వివరించారు. ఈ ప్రాజెక్టు కోసం నగరపాలక సంస్థ ఇప్పటికే రూ.30 కోట్లు కేటాయించిందని ఆయన తెలిపారు.
నగరంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన హోర్డింగ్లు ప్రజల భద్రతకు ప్రమాదంగా మారుతున్నాయని పలువురు సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది మార్చి నెలాఖరు లోపు అన్ని అక్రమ హోర్డింగ్లను Guntur Municipal Corporationతొలగిస్తామని హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ అధికారులు తన సూచనలను పాటించడం లేదని మేయర్ కోవెలముడి రవీంద్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో ఆమోదం పొందిన రూ.22 కోట్ల పనులకు సంబంధించిన పూర్తి సమాచారం లేకుండా బిల్లులు ఎలా చెల్లించాలంటూ కమిషనర్ ప్రశ్నించారు. చివరగా ఈ సమావేశంలో మొత్తం 167 అంశాలకు కౌన్సిల్ ఆమోదం తెలిపినట్లు మేయర్ ప్రకటించారు..