ఏపీలో ఓటర్ జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ప్రత్యేక ఇన్టెన్సివ్ రివిజన్ (SIR) విధానంలో ఓటర్ జాబితా సవరణపై అభిప్రాయాలను సేకరించేందుకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీల నేతలు తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.
ఎస్ఐఆర్ అమలు కోసం 2002 సంవత్సరాన్ని కటాఫ్ తేదీగా తీసుకోకూడదని, బదులుగా రాష్ట్ర విభజన అనంతరంగా రూపొందించిన 2014 ఓటర్ జాబితాను ఆధారంగా తీసుకోవాలని టీడీపీ నేతలు సూచించారు. అలాగే, ఓటరు కార్డును ఆధార్ కార్డుతో లింక్ చేయాలని, ఒక ఓటరుకు ఒక్క ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడ్డారు. వీవీ ప్యాట్ డిస్‌ప్లే టైమ్‌ను 6 సెకన్ల నుంచి పెంచాలని కోరారు.
టీడీపీ నాయకులు ఎన్నికల వ్యవస్థ పారదర్శకంగా ఉండాలన్నదే తమ విధానమని స్పష్టం చేశారు. ఇక బీజేపీ వర్గం ఈవీఎం లపై తమకు ఎలాంటి సందేహాలు లేవని స్పష్టం చేసింది. ఎస్‌ఐఆర్ ప్రక్రియ చేపట్టే ముందు అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని నిర్ణయం తీసుకోవాలని సీపీఎం నేతలు కోరారు. ఎస్ఐఆర్ చేయాలనే కచ్చితమైన ఆదేశాలు ఇంకా లేవని సీఈవో టీడీపీ నేతలతో అన్నారు.