⚡ BREAKING

Krishna District: కృష్ణా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం.. పోలీస్ స్టేషన్ల ఆధునికీకరణపై దృష్టి!

Krishna District: కృష్ణా జిల్లా పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు సందడిగా జరిగాయి. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హోం మంత్రి వంగలపూడి అనిత తో కలిసి కంకిపాడు, ఆత్కూరులో నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు.

Krishna District: కృష్ణా జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం..

కృష్ణా జిల్లా పెనమలూరు, గన్నవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కొల్లు రవీంద్ర..

హోం మంత్రి అనితతో కలిసి కంకిపాడు,ఆత్కూరు పోలీస్ స్టేషన్ నూతన భవనాల ప్రారంభం..

కృష్ణా జిల్లా పెనమలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో సోమవారం పలు అభివృద్ధి కార్యక్రమాలు సందడిగా జరిగాయి. రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర హోం మంత్రి వంగలపూడి అనిత తో కలిసి కంకిపాడు, ఆత్కూరులో నూతన పోలీస్ స్టేషన్ భవనాలను ప్రారంభించారు. అనంతరం ఆత్కూరు గ్రామంలో రూ.1.20 కోట్ల ఉపాధి హామీ నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజలకు ఉత్తమ పోలీసింగ్ అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లను ఆధునిక సదుపాయాలతో అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

ఆత్కూరు పోలీస్ స్టేషన్ నిర్మాణానికి రూ.60 లక్షల సొంత నిధులు కేటాయించిన హరికృష్ణకు మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మించిన ఈ భవనం ప్రజలకు మరింత ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు.

రాష్ట్రంలో మహిళలపై నేరాల నివారణలో కృష్ణా జిల్లా అగ్రస్థానంలో నిలవడం అభినందనీయమని, ఈ విషయంలో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ సేవలను మంత్రి ప్రశంసించారు. శాంతి భద్రతల పరిరక్షణలో సాంకేతికత వినియోగం కీలకమని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఏఐ వినియోగాన్ని పెంచాలని సూచించారని గుర్తు చేశారు.

పోలీస్ స్టేషన్లలో ఏర్పాటు చేస్తున్న కెమెరాలను ఏఐ వ్యవస్థతో అనుసంధానం చేస్తే నేరస్తులను వెంటనే గుర్తించే అవకాశం ఉంటుందని మంత్రి వివరించారు. తిరుమలలో ఇప్పటికే ఏఐ ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థ అమలుతో భక్తుల రద్దీని సమర్థంగా నియంత్రిస్తున్నారని ఉదాహరణగా చెప్పారు.

ప్రజల భద్రత కోసం ప్రభుత్వం పోలీస్ శాఖను మరింత బలోపేతం చేస్తోందని, ఇటీవలే సుమారు 6 వేల మంది పోలీస్ కానిస్టేబుళ్ల నియామక ప్రక్రియను పూర్తి చేశామని తెలిపారు. ప్రజల కోసం నిరంతరం పనిచేసే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.

అనంతరం గన్నవరం నియోజకవర్గం ఆత్కూరులో రూ.1.20 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా గుంతలులేని రోడ్లు నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి చెప్పారు. ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న చొరవ అభినందనీయమన్నారు.

ప్రతి గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా గ్రామాల రూపురేఖలు మారుతాయని మంత్రి అభిప్రాయపడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వీరంకి వెంకట గురుమూర్తి, జనసేన జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

Be the first to react

Latest