వెనిజులా (Venezuela) తర్వాత… ట్రంప్ టార్గెట్‌లో (Trumps target) మరిన్ని దేశాలా? అనే చర్చ ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. వెనిజులాపై దాడి చేసి ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తన తదుపరి చర్యలపై సంచలన సంకేతాలు ఇస్తున్నారు. ట్రూత్ సోషల్ వేదికగా చేసిన వ్యాఖ్యలు చూస్తే, వెనిజులాతో ఆగేలా కనిపించడం లేదు. గ్రీన్లాండ్, కొలంబియా, ఇరాన్, మెక్సికో, క్యూబా వంటి దేశాలపై కూడా ఆయన దృష్టి పెట్టే అవకాశముందని అంతర్జాతీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ప్రత్యేకంగా ఇరాన్ అంశం ట్రంప్‌ను తీవ్రంగా ఆగ్రహానికి గురిచేస్తోంది. ఇరాన్ అణు కార్యక్రమాలు ప్రపంచ భద్రతకు ముప్పుగా మారాయని ఆయన గతం నుంచే ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. తాజాగా ఇరాన్‌లో జరిగిన నిరసనల్లో పోలీసుల కాల్పులకు ఏడుగురు మృతి చెందడం ట్రంప్ ఆగ్రహాన్ని మరింత పెంచింది. “శాంతియుత నిరసనలపై కాల్పులు జరపడం ఇరాన్‌కు అలవాటైపోయింది.
దీన్ని వెంటనే ఆపాలి. లేకపోతే అమెరికా జోక్యం తప్పదు. మేము లాక్ చేసి, లోడ్ చేసుకుని సిద్ధంగా ఉన్నాం” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపాయి. దీనికి ప్రతిగా, “అమెరికా జోక్యం చేసుకుంటే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయి” అంటూ ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ పరిణామాలతో మధ్యప్రాచ్యంలో మరోసారి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయనే భయం నెలకొంది.
ఇక గ్రీన్లాండ్ విషయానికి వస్తే, వ్యూహాత్మకంగా కీలకమైన ఈ ప్రాంతంపై ట్రంప్ ప్రత్యేక ఆసక్తి చూపుతున్నారని సమాచారం. ఆర్కిటిక్ ప్రాంతంలో వనరులు, భౌగోళిక ప్రాధాన్యం దృష్ట్యా గ్రీన్లాండ్‌పై పట్టు సాధించాలన్న ఆలోచన ట్రంప్‌కు కొత్తది కాదు. గతంలోనూ గ్రీన్లాండ్‌ను కొనుగోలు చేయాలన్న వ్యాఖ్యలతో ఆయన సంచలనం సృష్టించారు. ఇప్పుడు అదే ప్రాంతంలో ఉన్న ఐస్‌ల్యాండ్ సహా ఆర్కిటిక్ జోన్‌పై అమెరికా ప్రభావం పెంచే ప్రయత్నాలు జరుగుతాయన్న అంచనాలు ఉన్నాయి.
లాటిన్ అమెరికాలో కొలంబియా, మెక్సికో దేశాలపై ట్రంప్ దృష్టి ప్రధానంగా డ్రగ్ ముఠాలపైనే కేంద్రీకృతమై ఉంది. అమెరికాలో డ్రగ్స్ ప్రవాహానికి ఈ దేశాలే కేంద్రాలుగా మారాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. డ్రగ్ కార్టెల్స్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే సైనిక జోక్యానికి కూడా వెనుకాడబోమని ఆయన ప్రకటించారు. ఇది ఆయా దేశాల్లో రాజకీయ ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు క్యూబా దశాబ్దాలుగా అమెరికాకు కొరకరాని కొయ్యగా నిలిచింది. కమ్యూనిస్టు పాలన, అమెరికా వ్యతిరేక వైఖరి కారణంగా క్యూబాపై ట్రంప్ ఎప్పటికప్పుడు తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. వెనిజులా తర్వాత క్యూబాపై కూడా ఆంక్షలు, దాడులు పెరిగే అవకాశముందని అంతర్జాతీయ వర్గాలు భావిస్తున్నాయి.
ఇక వెనిజులా అంశం అయితే మరింత సంచలనంగా మారింది. “వెనిజులాలో జరిగిన భారీ పేలుళ్ల వెనుక మేమే ఉన్నాం. అధ్యక్షుడు నికోలస్ మదురో, ఆయన భార్య ఇప్పుడు మా అదుపులో ఉన్నారు. ఇది లార్జ్ స్కేల్ ఆపరేషన్. వెనిజులా అంతర్జాతీయ డ్రగ్స్ కేంద్రంగా మారింది” అంటూ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని షాక్‌కు గురిచేశాయి. ఈ అంశంపై త్వరలో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని ఆయన ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
మొత్తానికి, ట్రంప్ వ్యాఖ్యలు చూస్తే వెనిజులా కేవలం ఆరంభమేనా? అన్న ప్రశ్న ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. ఆయన దూకుడు వైఖరి, సోషల్ మీడియా ద్వారా ఇచ్చే హెచ్చరికలు అంతర్జాతీయ రాజకీయాలను మరింత అస్థిరత వైపు నెట్టే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో ట్రంప్ చర్యలు ప్రపంచ శాంతిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాల్సి ఉంది.